కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరితమైన రాజకీయ దుర్వినియోగాన్ని ప్రజలందరూ ఖండించాలని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద బుధవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్ ఇంటి పై ఈ డి దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మతోన్మాద బిజెపి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం దుందుడుకుగా వ్యవహరిస్తుందని అన్నారు. కేరళలో బిజెపి ఘోరంగా ఓడిపోవడంతో, బిజెపి, కాంగ్రెస్ కుమ్మక్కై ఆదర్శవంతమైన సిపిఎం నాయకుడి పై బురదజల్లేందుకు, అక్రమ కేసులు పెట్టేందుకు ఈడీని ఉసిగొల్పిందని అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అప్రజా స్వామీక దాడులను ప్రజలందరూ ఖండించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, సిఐటియు తాడేపల్లి మండల కన్వీనర్ పల్లె కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అప్పలస్వామి, ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



