GUNTUR CITY NEWS: ఒకటో తేదీనే పెన్షన్.. పేదలకు కొండంత భరోసా

Karthik

ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరడం పేదలు, వృద్ధులు, మరియు వికలాంగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీలో భాగంగా సోమవారం ఉదయం శ్రీనివాసరావుతోట 69వ సచివాలయం పరిధిలో అచ్చి నాగేంద్రం అనే వికలాంగురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీని స్వయంగా పరిశీలించడంతో పాటు, స్థానిక వృద్ధులు మరియు వికలాంగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒకటో తేదీనే, అది కూడా ఉదయాన్నే తమ ఇంటి గుమ్మం వద్దకే వచ్చి పెన్షన్ అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి మరియు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ గుంటూరు నగరంలో 12వందల మంది క్షేత్రస్థాయి సిబ్బంది, 57 మంది పర్యవేక్షణ అధికారులు 26 కేటగిరీలకు చెందిన 57,018 మంది పెన్షనర్లకు షుమారు రూ.25.16 కోట్ల పెన్షన్ సొమ్మును పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రం లోపు నగరంలోని 100 శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో ఏ ఒక్క అర్హుడూ పెన్షన్‌కు దూరం కాకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, మరియు వికలాంగులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. లబ్ధిదారులు ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సిబ్బంది స్వయంగా వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించాలని ఆదేశించారు.పర్యటనలో పెన్షన్ పంపిణీ సందర్భంగా స్థానిక ప్రజలు కొన్ని తాగునీటి బోర్ వెల్స్ పాడైపోయిన విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన తక్షణమే స్పందిస్తూ, ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా సాయంత్రంలోగా ఆ బోర్ వెల్స్ అన్నింటికీ మరమ్మతులు (రిపేర్లు) పూర్తి చేయాలని సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ ఆదేశించారు.కార్యక్రమంలో ఉపా సెల్ పిఓ సింహాచలం, పర్యవేక్షణ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review