గుంటూరు నగరానికి అతి సమీపంగా ఉన్న సి ఆర్ డి ఏ నిధులతో నిర్మించబోవు రహదారికి గానూ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. NH – 16 సర్వీస్ రోడ్డు నుంచి అంతవరప్పాడు వరకు నిర్మించబోవు ఈ రహదారి నిర్మాణానికి గాను రూ 6.7 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ.. ఈ రహదారి నిర్మాణం కోసం గ్రామ ప్రజలు చాలా కాలంగా అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ పనులకు ఆమోదం లభించడం సంతోషకరం. CRDA పరిధిలో ఈ ప్రాంతం ఉండడం వల్ల అవసరమైన నిధులు సమకూరాయి. గ్రామ నాయకులు, ఎమ్మెల్యే గారి కృషితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకురాగలిగాం. సుమారు రూ.6.7 కోట్ల అంచనాతో 3.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించాం. మంచి నాణ్యతతో రోడ్డు నిర్మాణం జరిగేలా గ్రామ ప్రజలు కూడా పర్యవేక్షించి సహకరించాలి. కనీసం 5 నుంచి 7 సంవత్సరాల పాటు రహదారి మన్నికగా ఉండేలా పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. గ్రామ ప్రజలు రహదారితో పాటు మరికొన్ని సమస్యలను కూడా మా దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ కాలనీల్లో డ్రైనేజీ సదుపాయాల కొరత, గుంటూరు ఛానల్లోకి మురుగునీరు వెళ్లే సమస్య, అంతర్గత రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై కూడా చర్యలు తీసుకుంటాం. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే నేడు ప్రతి గ్రామంలో అభివృద్ధి స్పష్టంగా కనిపించాలి అనేదే మా లక్ష్యం. గుంటూరు ఛానల్ పనులు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి సదుపాయాలు, వాటర్ ట్యాంకుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాకపోయినా, ప్రతి సంవత్సరం ఒక్కో సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ ముందుకు సాగుతాం. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాం. ప్రజల సహకారంతో గ్రామాల సమగ్ర అభివృద్ధి దిశగా నిరంతరం పనిచేస్తామని ఆయన వెల్లడించారు.



