ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారం నాణ్యతతో కూడినదై ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం అర్జీలను అందజేస్తుంటారని వారి అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో వి.జ్యోతి బసు, డ్వామా పిడి శంకర్, డిప్యూటీ కలెక్టర్ లు గంగ రాజు, లక్ష్మీ కుమారి, జిల్లా మైనారిటీ ఆఫీసర్ జె.పార్థసారథి ప్రజల నుంచి ప్రజా సమస్యల ను స్వీకరించి సంబంధిత అధికారుల కు అంద జేశారు. అదేవిధంగా జిల్లాలో పి.జి.ఆర్.ఎస్ కు మొత్తం 525 అర్జీలు అందాయి. అందులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 284, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన పి.జి.ఆర్.ఎస్ కు 172 అర్జీలు, గుంటూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో 10 అర్జీలు, తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో 22 అర్జీలు, గుంటూరు నగర పాలక సంస్థకు 35, మిగిలిన మున్సిపాలిటీల పరిధిలో 2 అర్జీలు అందాయి.



