చీరాల, జూన్ 19:– స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో మొత్తం 70 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ప్రాంగణ ఎంపికల సందర్భంగా సంస్థ ప్రతినిధులు కంపెనీ ఆవిర్భావం, సంస్థలో ఉద్యోగ అవకాశాలు, ఎంపిక కాబోయే అభ్యర్థులకు అవసరమైన నైపుణ్యాలు, విధులు, బాధ్యతలు, అలాగే కంపెనీ కల్పించే సౌకర్యాల గురించి విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీశ్ బాబు తెలిపారు.
ఈ నియామక ప్రక్రియకు మొత్తం 265 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో సెయింట్ ఆన్స్ కాలేజ్‌కు చెందిన 48 మంది, ఇతర కళాశాలలకు చెందిన 22 మంది విద్యార్థులు ఎంపికై మొత్తం 70 మంది ఉద్యోగ అవకాశాలను పొందారని తెలిపారు.
ఎంపికైన వారిలో బీటెక్ ఈసీఈ విభాగం నుంచి 23 మంది, ఈఈఈ నుంచి 9 మంది, మెకానికల్ ఇంజినీరింగ్ నుంచి 2 మంది ఉన్నారు. అలాగే డిప్లొమా ఈసీఈ విభాగం నుంచి 10 మంది, ఈఈఈ నుంచి ఒకరు, మెకానికల్ విభాగం నుంచి 3 మంది ఎంపికైనట్లు వివరించారు. మిగిలిన 22 మంది ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.4.20 లక్షల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కూడా అందజేయనున్నట్లు కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి ఎన్. పూర్ణచంద్రరావు వెల్లడించారు.
ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణ ఎంపికల్లో విజయం సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, విభాగాధిపతులు, అధ్యాపకులు, సహ విద్యార్థులు అభినందించారు.



