చీరాల, జూన్ 19 :– 23 (ఏ) బెటాలియన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ (CATC-I)లో గుంటూరు గ్రూప్‌కు ప్రాతినిధ్యం వహించే థాల్ సైనిక్ క్యాంప్ (TSC) జట్టు ఎంపికల ట్రయల్స్ గురువారం ప్రారంభమయ్యాయి.
క్యాంప్ కమాండెంట్ కల్నల్ గోపాల్ త్రిపాఠి, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ ఎన్.ఎస్. పరమార్ పర్యవేక్షణలో ఈ ఎంపికల ప్రక్రియ కొనసాగుతోంది. గుంటూరు గ్రూప్ పరిధిలోని వివిధ ఎన్‌సీసీ బెటాలియన్లకు చెందిన ప్రతిభావంతులైన క్యాడెట్లు ట్రయల్స్‌లో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
ట్రయల్స్‌లో భాగంగా నిర్వహించిన ఆబ్స్టాకిల్ ట్రైనింగ్ (OT) పరీక్షలో క్యాడెట్లు వివిధ అడ్డంకులను అధిగమిస్తూ తమ శారీరక సామర్థ్యం, చురుకుదనం, ధైర్యసాహసాలను చాటుకున్నారు. అనంతరం హెల్త్ అండ్ హైజీన్, సర్వీస్ సబ్జెక్టులకు సంబంధించిన రాత పరీక్షలు నిర్వహించారు.
సాయంత్రం జరిగిన మ్యాప్ రీడింగ్, జడ్జింగ్ డిస్టెన్స్ అండ్ ఫీల్డ్ సిగ్నల్స్ (JDFS) ప్రాక్టికల్ పరీక్షల్లో కూడా క్యాడెట్లు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. రోజంతా నిర్వహించిన అన్ని పరీక్షల్లో క్యాడెట్లలో విశేష ఉత్సాహం కనిపించింది.
ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ రణవీర్ సింగ్, అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ మేడికొండ రాజేష్ బాబు, ట్రైనింగ్ జేసీఓ సుబేదార్ రవీంద్ర సింగ్, సుబేదార్ సుభాష్ చంద్ర, బీహెచ్‌ఎం పి. రమేష్, హవల్దార్లు పవన్, లింబు, రమేష్‌తో పాటు వివిధ ఎన్‌సీసీ బెటాలియన్ల అధికారులు, ఏఎన్‌వోలు, పీఐ స్టాఫ్ పాల్గొన్నారు.
గుంటూరు గ్రూప్ తరఫున జాతీయ స్థాయిలో జరిగే థాల్ సైనిక్ క్యాంప్‌లో ప్రాతినిధ్యం వహించే ఉత్తమ క్యాడెట్ల ఎంపిక కోసం ఈ ట్రయల్స్ కీలకంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు.



