West Godhavari distric news :సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప్ర‌గ‌తి ప‌థంలో ఆంధ్రప్రదేశ్-మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

Sharat
1 View
సీఎం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప్ర‌గ‌తి ప‌థంలో ఆంధ్రప్రదేశ్: మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

భీమ‌వ‌రం :– ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌ర్థ నాయ‌క‌త్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ ప‌థంలో దూసుకుపోతోంద‌ని రాష్ట్ర ఇంధ‌నశాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వరం పరిధిలోని పెదఅమిరంలో శుక్రవారం నిర్వ‌హించిన ‘కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్స‌వ స‌భ’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్, పీఎం నరేంద్ర మోదీల త్రిముఖ వ్యూహంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తోందని కొనియాడారు.

సంక్షేమ రంగంలో సరికొత్త రికార్డులు

దేశంలో ఎక్క‌డాలేని విధంగా రాష్ట్రంలో 67 లక్షల మంది ల‌బ్ధిదారుల‌కు ఏటా సుమారు రూ.33 వేల కోట్ల భారీ వ్యయంతో పెన్ష‌న్లు అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.10 వేల కోట్లకు పైగా నిధులను అర్హులైన తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశామని గుర్తుచేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గ్రామీణ విప్లవం.. నాణ్యమైన విద్యుత్

ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలో ‘పల్లె పండుగ’ కార్యక్రమం ద్వారా గ్రామగ్రామాన సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ అంత‌రాయాలు, లో వోల్టేజ్ సమస్యలు లేని నాణ్య‌మైన విద్యుత్ సరఫరా కోసం రూ.6 వేల కోట్లతో సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే ఐయినవల్లిలో 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించినట్లు చెప్పారు. ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల స‌బ్సిడీ సోలార్ విద్యుత్ కనెక్షన్లు మంజూరయ్యాయని, వాటిలో 6 ల‌క్ష‌ల క‌నెక్ష‌న్ల‌ను ఎస్సీ, ఎస్టీల‌కు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ పథకం కోసం రూ.257 కోట్లకు పైగా వ్యయం చేశామని వివరించారు.

పరిశ్రమలు, ఆక్వా రంగానికి పెద్దపీట

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం బాధ్యతగా అభివృద్ధి చేస్తోందని మంత్రి విమర్శించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయత్నాలను సీఎం చంద్ర‌బాబు కేంద్రంతో మాట్లాడి అడ్డుకున్నారని, ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో, ఉండి మండల ఆక్వా రైతుల విజ్ఞప్తి మేరకు 16 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందిస్తూ నష్టాల నుంచి రక్షిస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని, భవిష్యత్తులోనూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

ఈ విజయోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానడు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కూట‌మి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review