జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. స్వయంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది నియమించబడగా, పరీక్ష ప్రారంభానికి ముందే అన్ని కేంద్రాల వద్ద భద్రతా చర్యలు అమలు చేశారు. ఎస్పీ పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి, అక్కడ చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థుల ప్రవేశ సమయంలో నిర్వహిస్తున్న తనిఖీలు, హాల్ టికెట్లు మరియు గుర్తింపు కార్డుల ధృవీకరణ ప్రక్రియ, మహిళా అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ సదుపాయాలు, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో చేపట్టిన భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.



