సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ
జగ్గయ్యపేట మండలం, ధర్మవరపాడు తండా:సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా కార్మికులు అప్రమత్తంగా ఉండాలని రూరల్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ సూచించారు. జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడు తండా గ్రామంలోని రాంకో సిమెంట్ కర్మాగారంలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, వాట్సాప్ చాటింగ్‌లు, గుర్తు తెలియని వ్యక్తులు పంపించే APK ఫైల్స్ వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఎవరికీ తెలియజేయరాదని సూచించారు.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా ఆన్‌లైన్ మోసం జరిగితే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.
రాంకో సిమెంట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఫరూక్ మాట్లాడుతూ, అనవసరమైన కాల్స్, సందేశాల ద్వారా వచ్చే ప్రలోభాలకు కార్మికులు మోసపోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే పోలీసులను సంప్రదించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఎస్ఐ సూర్య శ్రీనివాస్, మణికంఠ, పోలీసు సిబ్బంది, రాంకో సిమెంట్ సంస్థ అధికారులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైబర్ నేరాల నివారణపై నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.



