నందిగామ (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా ఈరోజు నందిగామ నియోజకవర్గ పరిధిలోని పరిటాల గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం (SWMF) వద్ద ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి, అవగాహన కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షెడ్డు ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘స్వచ్ఛరథం’ వాహనం పనితీరును స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంటూ, వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ గ్రామంలో ఒక ఇంకుడు గుంట నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.
డ్వాక్రా మహిళలకు అగ్రిమెంట్ కాగితాల అందజేత:
ఎన్టీఆర్ జిల్లా పంచాయతీ అధికారి లావణ్య కుమారి అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిటాల గ్రామాన్ని నందిగామ నియోజకవర్గంలోనే ఒక ఆదర్శవంతమైన ‘ప్లాస్టిక్ రహిత గ్రామంగా’ తీర్చిదిద్దేందుకు గట్టి సంకల్పం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ బృహత్తర కార్యం విజయవంతం కావాలంటే గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇదే వేదికపై, పరిటాల పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘స్వచ్ఛ సంపద షెడ్డు’ నిర్వహణ బాధ్యతలను ఈరోజు నుండి గ్రామంలోని డ్వాక్రా సంఘానికి అప్పగిస్తూ, దానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను డ్వాక్రా మహిళలకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
శానిటేషన్ వర్కర్లకు సన్మానం – ప్రోత్సాహకాలు:
గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న శానిటేషన్ వర్కర్ల సేవలను కలెక్టర్ కొనియాడారు. సఫాయి కర్మచారులను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారికి ఉచితంగా నిత్యవసర వస్తువులను, ఏకరూప (యూనిఫామ్) దుస్తులను పంపిణీ చేశారు. అలాగే, తమ ఇంటి ఆవరణలోనే సొంతంగా కంపోస్టు తయారు చేసుకుంటూ, ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్న పలువురు మహిళలను గుర్తించి, వారిని ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.
పెద్ద సంఖ్యలో హాజరైన అధికారులు, ప్రజలు:
ఈ పర్యటనలో విజయవాడ డివిజనల్ పంచాయతీ అధికారి రాఘవన్, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, నందిగామ ఆర్డీవో, డి.డి.ఓ లక్ష్మీ కుమారి, వెలుగు పీడీ, స్థానిక ఎంపీడీవో, తహసిల్దార్‌లతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు మరియు పరిటాల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



