బాపట్ల:– వ్యవసాయ విద్యార్థులు తమ విద్యను ఎంతో శ్రద్ధతో పెంచి పోషించిన ఒక విత్తనంలా భావించాలని, విలువలు, కృషి, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసంతోనే నిజమైన సామర్థ్యాన్ని వెలికితీయగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ షేక్ అబ్దుల్ నజీర్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ వార్షిక స్నాతకోత్సవ సభకు అధ్యక్షత వహించిన గవర్నర్ పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆరోగ్యకరమైన విత్తనం సారవంతమైన నేల, తగినంత తేమ, సరైన సంరక్షణతో సమృద్ధిగా పంటనిచ్చే మొక్కగా ఎదిగినట్లే, విద్యార్థులు కూడా విలువలు, అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర శ్రమతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం చెప్పిన “విజయం శాశ్వతం కాదు.. అపజయం అంతిమం కాదు.. విజయం తర్వాత శ్రమను ఆపకూడదు.. అపజయం తర్వాత ప్రయత్నాన్ని మానకూడదు” అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి జీవితాంతం గుర్తుంచుకోవాలని సూచించారు.
పొందిన డిగ్రీ కేవలం విద్యా విజయానికి గుర్తింపు మాత్రమే కాదని, సమాజం పట్ల ఒక గొప్ప బాధ్యత అని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రతి వ్యవసాయ పట్టభద్రుడు బలమైన వ్యవసాయ రంగం, ఆరోగ్యవంతమైన గ్రామీణ సమాజం, సుస్థిర భవిష్యత్తు నిర్మాణానికి ఆశాకిరణంగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశానికి అన్నం పెడుతున్న రైతును ఎప్పటికీ మరవకూడదని, అనేక పర్యావరణ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ రైతు దేశాన్ని పోషిస్తున్నాడని కొనియాడారు. విద్యార్థుల జ్ఞానం రైతు సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని కలిగించే శక్తిగా మారాలని, పరిశోధనలు క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారాలు చూపాలని, వారి వృత్తిపరమైన సేవలు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేలా ఉండాలని ఆకాంక్షించారు.
భారతరత్న డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ పేర్కొన్న “వ్యవసాయం కేవలం వృత్తి కాదు.. అది జీవన విధానం” అనే సూక్తిని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు. విశ్వవిద్యాలయంలో సంపాదించిన జ్ఞానం, విలువలు, నైపుణ్యాలు విద్యార్థులను సృజనాత్మక నాయకులుగా తీర్చిదిద్దాలని, సమాజానికి సేవ చేసే దిశగా నడిపించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు, అందించిన ప్రోత్సాహం అమూల్యమని ప్రశంసించారు. అలాగే విశ్వవిద్యాలయ అభివృద్ధికి కృషి చేసిన ఉపకులపతి, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్–ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ, రిజిస్ట్రార్ ఏ. మణి, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసూన రాణి, విశ్వవిద్యాలయ అధికారులు, పూర్వ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



