గుంటూరు: జూలై 29:- గుంటూరు మెడికల్ కళాశాల మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ ఆధ్వర్యంలో నూతన మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ (MEU) ప్రాంగణంలో నిర్వహించిన రెండు రోజుల కరికులం ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ (CISP) వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఎన్‌ఎంసీ ప్రాంతీయ కేంద్రం, ఏలూరులోని ఆశ్రం మెడికల్ కళాశాల పర్యవేక్షణలో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన 30 మంది అధ్యాపకులు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. రెండు రోజులపాటు రిసోర్స్ పర్సన్లు సామర్థ్య ఆధారిత వైద్య విద్య, ఆధునిక బోధన–అభ్యసన విధానాలు, విద్యార్థుల మూల్యాంకన పద్ధతులు, ఎన్‌ఎంసీ మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై ప్రాయోగిక శిక్షణతో పాటు పరస్పర చర్చలను నిర్వహించారు.
ముగింపు కార్యక్రమానికి వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ విష్ణువర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసిన అధ్యాపకులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధికి ఆధునిక సదుపాయాలతో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన గుంటూరు మెడికల్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. వర్క్‌షాప్‌లో నేర్చుకున్న అంశాలను రోజువారీ బోధనలో అమలు చేసి వైద్య విద్య నాణ్యతను మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అదనపు వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ ఎన్.వి. సుందరాచారి, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ బి. శ్రీధర్, డాక్టర్ డి. మాధవి, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. రమణకుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి. సుందరాచారి మాట్లాడుతూ, నూతన మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌కు ఆధునిక ఫర్నిచర్‌తో పాటు అవసరమైన సదుపాయాల ఏర్పాటుకు విరాళం అందించిన దాత మంచాల రామయ్య సేవలను ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
చివరగా, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలకు అనుగుణంగా బోధనా విధానాలను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు సమష్టిగా కృషి చేస్తామని అధ్యాపకులు ప్రతిజ్ఞ చేయడంతో రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ముగిసింది.



