Guntur City News :డొంక రహదారుల ప్రతిపాదనలు శత శాతం రావాలి-పంట బీమా, అన్నదాత సుఖీభవ నమోదు పూర్తి చేయాలి-కలెక్టర్ సాయికాంత్ వర్మ

Sharat
4 Views

గుంటూరు, ఆగస్టు 10:– జిల్లాలో పంట పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే డొంక రహదారుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు శత శాతం అందించాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వి.బి.జి. రామ్‌జీ పనుల్లో వేతనదారులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పంట బీమా ప్రక్రియను శత శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించేలా రైతుల నమోదు ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపట్టాలని స్పష్టం చేశారు.

ప్రజా సానుకూల స్పందన (పి.పి.పి) పెరిగేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడేందుకు నాణ్యమైన సేవలను అందించాలని ఆదేశించారు. ప్రజలకు అందే ప్రతి సేవలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

11 నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు

జిల్లాలో ఆధార్‌కు సంబంధించిన ప్రత్యేక శిబిరాలను ఈ నెల 11వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు, తిరిగి 17 నుంచి 20వ తేదీ వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని చెప్పారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న బయోమెట్రిక్ అప్డేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు.

జిల్లాలో 64,067 ఆధార్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధార్ అప్డేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి. జ్యోతిబసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. శంకర్, ముఖ్య ప్రణాళిక అధికారి పి. శేషశ్రీ, జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review