ముంబై:-ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులు, ఉద్యోగాల హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి.. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, డేటా సెంటర్లు, అమరావతి నిర్మాణం, ఉద్యోగాల కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఫ్యూచర్ రెడీయింగ్ ఇండియా – ది ఆంధ్ర ఎక్స్‌పీరియన్స్’ అంశంపై నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్‌లో మాట్లాడిన మంత్రి లోకేష్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర-రాష్ట్ర సమన్వయమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను కేవలం 13 నెలల్లో తీసుకురావడం, ఆర్సెలార్ మిట్టల్ భారీ పెట్టుబడి ప్రాజెక్టును 17 నెలల్లో ప్రారంభించడం రాష్ట్ర వేగానికి నిదర్శనమన్నారు. గూగుల్ వంటి పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో, ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యమని, ఎందుకంటే అవే అధిక స్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తాయని తెలిపారు.
డేటా సెంటర్లపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్న లోకేష్.. 6.5 గిగావాట్ల డిజిటల్ హబ్ నిర్మాణం ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున ఐటీ, ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. డేటా సెంటర్లకు అవసరమయ్యే నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం వెతికే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే విద్య, ఐటీ రంగాలను అనుసంధానం చేస్తూ ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీలకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు.
అలాగే రాష్ట్రంలో మూడు ప్రధాన ఎకనామిక్ రీజియన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. డేటా సెంటర్లు, ఫార్మా, డిఫెన్స్, స్పేస్, గ్లాస్, ఐటీ వంటి రంగాల్లో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ పూర్తి స్థాయి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నామని వివరించారు.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని లోకేష్ తెలిపారు. 2028 నాటికి ప్రభుత్వ కోర్ ప్రాంతాన్ని దేశానికి అంకితం చేస్తామని, ఇప్పటికే పలువురు జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు.
రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని, దేశాభివృద్ధిలో యువత, మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.



