విజయవాడ, జూలై 30:-ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘తల్లికి వందనం’, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వంటి పథకాలను వర్తింపజేసి న్యాయం చేయాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు గురువారం విజయవాడలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ టి. రవీంద్రను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలతో పాటు దివ్యాంగుల పెన్షన్ను కూడా నిలిపివేయడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. నెలకు సుమారు రూ.15 వేల వేతనంతో కుటుంబ పోషణే భారంగా మారిందని, పెరిగిన జీవన వ్యయాల నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధి లేకపోవడం వారి పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చిందని తెలిపారు.
ఈ సమస్యను పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు తగిన చర్యలు చేపట్టలేదని షేక్ కాలేషా ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ‘తల్లికి వందనం’, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగుల హక్కుల చట్టం–2016 నిబంధనలకు అనుగుణంగా ఈ వర్గానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగ ఉద్యోగుల కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.



