బాపట్ల, జూలై 30 :– మార్కెట్లో బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ వెల్లడించారు. బియ్యం ధరల నియంత్రణపై జిల్లా కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో గురువారం రైస్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు.
మార్కెట్లో ప్రస్తుతం సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం కిలో రూ.65 వరకు విక్రయిస్తున్న నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి బాపట్ల, చీరాల, పర్చూరు, చెరుకుపల్లి, వేమూరు మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
రైస్ మిల్లర్ల సహకారంతో సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని కిలో రూ.52కు, స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, ముడి బియ్యాన్ని కిలో రూ.50కు ప్రజలకు అందుబాటులో విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
బియ్యం విక్రయ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒక్కో రైస్ కార్డుపై గరిష్ఠంగా 26 కిలోల బియ్యం మాత్రమే విక్రయించాలని, బియ్యం కొనుగోలు సమయంలో రైస్ కార్డుతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
ప్రతి విక్రయ కేంద్రంలో బియ్యం ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని, బియ్యం సరఫరాలో అంతరాయం లేకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సులభంగా చేరుకునే ప్రాంతాల్లోనే ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏడీ రమేష్ బాబు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.



