Vijayanagaram Local news :ఉత్తరాంధ్రకు ఉపాధి హబ్‌గా భోగాపురం ఎయిర్‌పోర్టు-ప్రత్తిపాటి

Sharat
1 View

విజయనగరం, జూలై 31 :– భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతం దేశంలోనే ఉత్తమ ఉపాధి అవకాశాల కేంద్రంగా రూపుదిద్దుకోబోతోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయని, భూముల విలువలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం విజయనగరంలో పర్యటించిన ప్రత్తిపాటి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే సభ ఏర్పాట్లు, పార్కింగ్, భోజన వసతులు, జనసమీకరణ తదితర అంశాలను స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

తర్వాత ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు నివాసంలో నిర్వహించిన కూటమి శ్రేణుల సమావేశంలో మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపు కానుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మెరైన్, ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, పర్యాటక రంగాల్లో భారీ పెట్టుబడులు ఆకర్షితమవుతాయని, లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు.

భోగాపురం విమానాశ్రయాన్ని గతంలో విమర్శించిన వారికి కూటమి ప్రభుత్వం తన పనితీరుతో సమాధానం చెప్పిందని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. “ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్‌బస్ ఎందుకు” అంటూ ఎగతాళి చేసినవారి విమర్శలను అభివృద్ధితోనే తిప్పికొట్టామని అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు లేని వారే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టిని విమర్శించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపిస్తోందని పేర్కొన్నారు.

అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు కలిసి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం అశోక్ గజపతిరాజు చేసిన కృషి ఎంతో కీలకమైందని ప్రత్తిపాటి కొనియాడారు. విమానాశ్రయ నిర్మాణం వెనుక ఆయన దూరదృష్టి, చొరవ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినవేనని పేర్కొన్నారు

Author
Share This Article
Leave a review