విజయవాడ, ఆగస్టు 2:– భారతీయ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా వేల ఏళ్ల వాస్తు వైభవం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రతీకలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. భారతీయ దేవాలయ నిర్మాణ స్ఫూర్తిని ఆధునిక నిర్మాణాల్లోనూ ప్రతిబింబించేలా వాస్తుశిల్పులు కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
విజయవాడలో నిర్వహించిన “సప్త సింధు – ది అమరావతి ఎడిషన్ 2026” కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని భావితరాలకు చేరవేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహించిన ఏఈ ఫౌండేషన్‌ను అభినందించారు. భారతీయ దేవాలయ నిర్మాణ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
దేవాలయాలు ఆధ్యాత్మిక విశ్వాసాలకు మాత్రమే కాకుండా భారతీయ వాస్తుశిల్ప ప్రతిభకు గొప్ప నిదర్శనాలని ఆయన అన్నారు. శతాబ్దాల క్రితం నిర్మించిన దేవాలయాల్లో కనిపించే శిల్పకళ, నిర్మాణ నైపుణ్యం, శాస్త్రీయ ప్రణాళిక నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పారు.
వాస్తుశిల్ప విద్యార్థులు శ్రీకాళహస్తి, లేపాక్షి, మదురై, సింహాచలం వంటి చారిత్రక దేవాలయాలను అధ్యయనం చేయాలని సూచించిన ఎమ్మెల్యే, వాటి నిర్మాణాలను యథాతథంగా అనుకరించడం కాకుండా వాటి వెనుక ఉన్న ఆలోచన, సూత్రాలు, నిర్మాణ విధానాన్ని అర్థం చేసుకుని ఆధునిక అవసరాలకు అనుగుణంగా వినూత్న నిర్మాణాలకు రూపకల్పన చేయాలని పిలుపునిచ్చారు.
సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో సమన్వయం చేయడం ద్వారానే భారతీయ వాస్తుశిల్పానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
భారతీయ సంస్కృతి, వారసత్వం, దేవాలయ నిర్మాణ సంప్రదాయాలపై యువతలో ఆసక్తి పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు.



