అమరావతి, ఆగస్టు 3 :- రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొనుగోలు, వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 అనంతరం భారీగా పెరిగిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) కొనుగోళ్లు, రూ.105 కోట్ల వ్యయంతో నిర్మించి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న పీఎస్ఏ (ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్) ప్లాంట్ల పనితీరుపై మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో సోమవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, వినియోగంపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి సిఫారసులు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎల్ఎంఓ కొనుగోళ్లలో వాస్తవ డిమాండ్, సరఫరా మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించి రెండు వారాల్లో సమగ్ర ఆడిట్ నిర్వహించాలని, అనంతరం ఎనిమిది ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలల పాటు అమలు చేసి అక్టోబర్ 15లోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
సమీక్షలో కోవిడ్‌కు ముందు 2016-2020 మధ్య నాలుగేళ్లలో బోధనాసుపత్రుల్లో ఎల్ఎంఓ కొనుగోళ్లకు రూ.60.51 కోట్లు ఖర్చు కాగా, కోవిడ్ తీవ్రంగా ఉన్న 2020-21, 2021-22 సంవత్సరాల్లో రూ.95.43 కోట్లు వెచ్చించినట్లు వెల్లడైంది. కోవిడ్ అనంతరం 2022-26 మధ్య నాలుగేళ్లలో ఈ వ్యయం రూ.180.82 కోట్లకు చేరినట్లు అధికారులు వివరించారు. కొత్త ఆసుపత్రులు, పడకల సంఖ్య పెరగడం కొంత మేర కారణమైనప్పటికీ, అధికారులు చూపుతున్న డిమాండ్‌కు వాస్తవ వినియోగానికి మధ్య గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం బోధనాసుపత్రులతో పాటు రెండు జిల్లా, రెండు ఏరియా ఆసుపత్రుల్లో ప్రత్యేక అధ్యయనం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ‘పాత్’ సంస్థ ఈ అధ్యయనాన్ని చేపట్టనుంది.
కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో డీఎంఈ పరిధిలో 62, సెకండరీ హెల్త్ పరిధిలో 100 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం మొత్తం 162 ప్లాంట్లలో 161 ప్లాంట్లు నిరుపయోగంగా మారినట్లు సమీక్షలో వెల్లడైంది. ఆక్సిజన్ నాణ్యత, నిర్వహణకు అవసరమైన సాంకేతిక సిబ్బంది లేకపోవడం, ఐసీయూ మరియు సాధారణ వార్డులకు ఒకే పైపులైన్ వ్యవస్థ ఉండటం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు వివరించారు.
ఈ ప్లాంట్ల మరమ్మతులకు డీఎంఈ పరిధిలో రూ.6.20 కోట్లు, వార్షిక నిర్వహణకు రూ.2.60 కోట్లు, డీఎస్హెచ్ పరిధిలో మరమ్మతులకు రూ.4.76 కోట్లు, నిర్వహణకు ఏటా రూ.6.70 కోట్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్లాంట్లను పునర్వినియోగానికి తీసుకురావడం ఆర్థికపరంగా సమర్థనీయమా, లేక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలా అనే అంశాలపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో పీఎస్ఏ ప్లాంట్ల నిర్వహణ విధానాన్ని కూడా అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ఎల్ఎంఓ నిల్వ, సరఫరా సమయంలో ఆక్సిజన్ లీకేజీలు జరుగుతున్నాయన్న సమాచారంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. లీకేజీలను అరికట్టేందుకు తక్షణమే పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, వార్డులు, ఐసీయూల్లో పడకల స్థాయిలో ఆక్సిజన్ వినియోగ వివరాలను నమోదు చేసే విధానం అమలు చేయాలని ఆదేశించారు. అధ్యయన కమిటీ నివేదిక వచ్చిన వెంటనే మరోసారి సమీక్ష నిర్వహించి, వాస్తవ అవసరాలకు అనుగుణంగానే ఆక్సిజన్ కొనుగోళ్లు జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు.
సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, ఏడీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి, డీఎంఈ జాయింట్ డైరెక్టర్ గణపతిరావు, డీఎస్హెచ్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సుజాతతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



