అమరావతి, ఆగస్టు 3 :– రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి, 2026–27 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో రాష్ట్రం దేశంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమని పేర్కొంటూ, అదే స్ఫూర్తితో ఈ ఏడాది మరింత బాధ్యతగా కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు.
సోమవారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు పురోగతిని పవన్ కళ్యాణ్ సమీక్షించారు. డివిజన్‌ల వారీగా లక్ష్యాలు, ఇప్పటివరకు నాటిన మొక్కల సంఖ్య, మడ అడవుల విస్తరణ, తాటి వనాల ఏర్పాటు, సామాజిక వనాల అభివృద్ధి వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మొక్కల నాటే కార్యక్రమాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, సముద్ర కోతల నివారణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో పచ్చదనంతో కూడిన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
వీబీజీ రాంజీ పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు అదనంగా 70 లక్షల మొక్కలు కేటాయించినట్లు పేర్కొంటూ, వీటిని సుమారు 2,500 హెక్టార్లలో నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ మొక్కలు గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు మరింత బలం చేకూరుస్తాయని తెలిపారు.
తాటి వనాల ఏర్పాటుకు ఈ ఏడాది 5,000 హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణయించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాలువ గట్లు, చెరువులు, సముద్ర తీర ప్రాంతాల్లో తాటి చెట్లు సహజ గాలి నిరోధక వ్యవస్థగా పనిచేస్తాయని, తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.
మడ అడవుల విస్తరణలో రాష్ట్రం సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, 2024–25లో 740 హెక్టార్లు, 2025–26లో 1,930 హెక్టార్లలో మడ అడవుల విస్తరణ చేపట్టడంతో దేశంలో రెండో స్థానం లభించిందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, పర్యావరణ నిపుణులను అభినందించారు. ఈ ఏడాది మిష్టి–2 (MISHTI-II) పథకం కింద మరో 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
జిల్లాల వారీగా గ్రీన్ వాల్ కార్యక్రమంలో 48 హెక్టార్లలో పరిహార అటవీకరణ, 1,993 హెక్టార్లలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద దేశీయ మొక్కల నాటకం, 727 హెక్టార్లలో షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం సర్కిల్‌లో 3,243 హెక్టార్లు, గుంటూరు సర్కిల్‌లో 1,832 హెక్టార్లు, విశాఖ సర్కిల్‌లో 1,764 హెక్టార్లలో అటవీకరణ లక్ష్యాలను అమలు చేయనున్నట్లు తెలిపారు.
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా తీర ప్రాంతంలో మూడు అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మొదటి అంచెలో మడ అడవులు, షెల్టర్ బెల్ట్‌ల అభివృద్ధి, రెండో, మూడో అంచెల్లో గ్రామ వనాలు, సామాజిక వనాలు, వ్యవసాయ వనాలను ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్థానిక భౌగోళిక పరిస్థితులు, వర్షపాతం, పర్యావరణ అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు చేసి, ప్రాజెక్టు లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్తోందని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.



