AP POLITICAL NEWS: ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి.. జైలుకెళ్లడానికైనా సిద్ధమే: అంబటి రాంబాబు

Karthik

గుంటూరు రాజకీయాల్లో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల తీరుపై మండిపడుతూ.. కార్యకర్తలకు, నాయకులకు ధైర్యం నూరిపోసేలా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక చట్టం అధికార పార్టీకి చుట్టంగా మారిపోయిందని అంబటి రాంబాబు విమర్శించారు. ముస్తఫా, ఎమ్మెల్యే విరూపాక్ష వంటి నేతలను తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ఎవరైనా భర్త తన భార్య బట్టలు చించితే, ఆ నెపాన్ని కూడా వైసీపీ నేత విరూపాక్షకు ఆపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఏ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు కనీసం నమోదు చేయడం లేదని, అదే సమయంలో తమ నాయకులను బయటకు రాకుండా చేసేందుకు బెయిల్ రాని సెక్షన్లతో కేసులు పెడుతున్నారని వాపోయారు. తన సొంత ఉదాహరణను ప్రస్తావిస్తూ.. తనపై పెట్టిన కేసు కేవలం 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయాల్సిన చిన్న కేసని, కానీ కుట్ర పూరితంగా తనను 18 రోజుల పాటు జైలులో పెట్టారని అంబటి గుర్తుచేశారు. గతంలో వైఎస్ జగన్ ను కూడా ఏఐ సాంకేతికతను ఉపయోగించి భయంకరంగా ట్రోల్ చేశారని, రాజకీయంగా కక్ష సాధింపులు కొత్తేమీ కాదని చెప్పారు..ప్రభుత్వం ఎంతమందిని అరెస్టు చేసినా భయపడేది లేదని అంబటి స్పష్టం చేశారు. ‘మీరు గుంటూరులో ఉన్నా, గుజరాత్లో ఉన్నా అరెస్టులు గ్యారెంటీ.. కాబట్టి భయపడి పారిపోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు’ అని నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని, పారిపోకుండా గుంటూరులోనే ఉండి చట్టబద్ధంగా, రాజకీయంగా ఎదుర్కోవాలని నేతలకు ధైర్యం చెప్పారు.

Author
Share This Article
Leave a review