GUNTUR DISTRICT NEWS: దేవాల‌య భూముల కౌలు రైతుల‌కు పంట ఋణాలు ఇవ్వాలి

Karthik

దేవాల‌య భూముల కౌలు రైతుల‌కు గుర్తింపు కార్డులిచ్చ పంట ఋణాలు ఇవ్వాల‌ని లేనిచో ఆందోళ‌న‌కు పూనుకుంటామ‌ని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్య‌క్ష‌లు పాశం రామారావు అన్నారు. క‌లెక్ట‌రేట్ వ‌ద్ద కౌలు రైతు సంఘం ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించి క‌లెక్ట‌ర్‌కు విన‌తిప్ర‌తం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎక‌రాలు దేవాల‌య భూములు పేద రైతులు సాగు చేస్తున్నార‌ని, 5స‌వంత్స‌రాల‌కు ఒక సారి వేలం పాట‌లు నిర్వ‌హించాల‌ని, రెండున్న‌ర ఎక‌రాల చొప్పున విడివిడిగా పాట నిర్వ‌హించాల‌ని కోరారు. ముంద‌స్తు కౌలు చెల్లింపు కాకుండా పంట‌ల వ‌చ్చిన అనంత‌రం కౌలు చెల్లించే ప‌ద్ధ‌తిని అవ‌లంభించాల‌ని కోరారు. సాధార‌ణ కౌలు రైతుల‌కు య‌జ‌మాని సంత‌కంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట ఋణాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి బి.రామ‌కృష్ణ మాట్లాడుతూ అన్న‌దాత సుఖీభ‌వ కౌలు రైతుల‌కు వ‌ర్తింప చేయాల‌ని, ఈ- క్రాప్ న‌మోదు ఆధారంగా పంట ఋణాలు ఇవ్వాల‌ని కోరారు. జిల్లా వ్యాపితంగా వ‌ర్షాలు లేక పంట‌లు ఎండిపోతున్నాయ‌ని, జిల్లాను క‌రువు జిల్లాగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. పంట‌ల భీమా ప‌ధ‌కాన్ని కౌలు రైతులంద‌రికీ వ‌ర్తింప చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్య‌క్షులు కందుల శ్రీ‌నివాస్‌, వ్య‌వ‌సాయ కార్మిక సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి ఈమ‌ని అప్పారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయ‌కులు నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు, నీలాంబ‌రం,యెగిల‌య్య‌, ఏడుకొండ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review