వేటపాలెం:– ఆపదలో ఉన్న సహ మాజీ సైనికుడి కుటుంబానికి భావపురి మాజీ సైనికుల సంక్షేమ సంఘం అండగా నిలిచింది. స్థానిక పోలీసుల చొరవ, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వంతో ఆస్తి వివాదం సుఖాంతమైంది.
బాధితుడు గాది కిషోర్ బాబు (తెలంగాణ గ్రామీణ బ్యాంక్, దేవరకొండ శాఖ క్యాషియర్) తమ పూర్వీకుల స్థలం విషయంలో బాబాయిల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సంక్షేమ సంఘాన్ని ఆశ్రయించారు. అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు, వృద్ధులైన తల్లిదండ్రులపై బెదిరింపుల ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న సంఘ నాయకులు వేటపాలెం పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల హెచ్చరికలు, సంఘ ప్రతినిధులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల ఫలితంగా ఒప్పందం కుదిరింది. సర్వే నంబర్ 157/14లోని 0.03 సెంట్ల స్థల వాటా కింద కిషోర్ బాబు తండ్రి శ్రీ గాది వెంకటరావుకు రూ. 1,00,000 (లక్ష రూపాయలు) పరిహారం చెల్లించారు.
ఈ పరిష్కారంపై బాధితుడు మరియు ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు జెట్టి జోసఫ్, అన్నలదాసు శాంతయ్య, వంశీ కృష్ణ వెలిచర్ల, వేణుగోపాల్ కొలసాని తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికుల హక్కుల పరిరక్షణకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటామని భావపురి సంఘం స్పష్టం చేసింది.



