హైదరాబాద్:– తెలంగాణలో దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ, సంక్షేమ శాఖతో పాటు అనుబంధ సంస్థలను బలోపేతం చేసి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని వికలాంగుల సంక్షేమ సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. అంజయ్య గౌడ్, దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పి. రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సౌండ్ లైబ్రరీ, బ్రెయిల్ ప్రెస్, శిక్షణ–ఉత్పత్తి కేంద్రాలు, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు బ్రెయిల్ ప్రెస్‌ను ఆధునీకరించాలని, వినికిడి పరికరాల తయారీ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
టీసీపీసీకి అనుబంధంగా ఉన్న ఐటీఐని ఏటీసీగా అభివృద్ధి చేసి దివ్యాంగులకు ఆధునిక నైపుణ్య శిక్షణ అందించాలని వారు సూచించారు. ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని కొనసాగించాలని కోరారు. దివ్యాంగుల వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి, విద్యతో పాటు కంప్యూటర్, వృత్తి నైపుణ్య శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్పీడబ్ల్యూడీ–2016 చట్టం నిబంధనల ప్రకారం ప్రత్యేక కమిషనర్‌ను నియమించాలని, దివ్యాంగుల కోసం ఏర్పాటైన సంస్థలు నిర్వీర్యం కాకుండా వాటిని పరిరక్షించి, వాటి అసలు లక్ష్యాలను పునరుద్ధరించాలని అంజయ్య గౌడ్, పి. రాజశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు.
వికలాంగుల సంక్షేమ శాఖలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న భారీ అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్, సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్‌గా దివ్యాంగుడినే నియమించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.



