GUNTUR CITY NEWS: పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Karthik

మున్సిపల్‌ ఎన్నికలకు హడావుడిగా సిద్ధం అవుతున్న ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చటంపై ఇంత వరకూ దృష్టి లేదని, పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హాక్కు ప్రభుత్వానికి లేదని సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబురావు అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి ఇల్లు ఐదెకరాల్లో పూర్తి అయిపోతుందని, ఎమ్మెల్యేలు, మంత్రుల క్వార్టర్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, కానీ పేదల ఇళ్లను మాత్రం గాలికి ఒదిలేశారని అన్నారు. టిడ్కో గృహాల సమస్యలు, జగనన్న కాలనీల సమస్యలపై సోమవారం సిపిఎం నాయకులు లబ్దిదారులతో కలిసి గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో బాబురావు మాట్లాడుతూ పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, కానీ రెండున్నరేళ్ల పాలనలో ఒక్క సెంటు కూడా ఇవ్వలేదన్నారు. గుంటూరు నగరంలోని సుమారు 40వేల మందికి జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టారని, కానీ మౌలిక వసతులు కల్పించకపోవటం వల్ల లబ్దిదారులు నివశించలేకపోతున్నారని అన్నారు. సుభాష్‌ ‌చంద్ర అనే బడా కార్పొరేట్‌ ‌కంపెనీకి చెందిన వ్యక్తి తీసుకున్న రూ.22వేల కోట్లు రద్దు చేసి, రూ.6 కోట్లు కడితే చాలని రుణం రద్దు చేశారన్నారు. రూ.50వేలు, రూ.1లక్ష రూపాయలు డిపాజిట్‌‌లు కట్టిన టిడ్కో గృహాల లబ్దిదారులకు ఎందుకు రద్దు చేయట్లేదన్నారు. డిపాజిట్‌‌లు కట్టిన 7 ఏళ్ల తర్వాత ఇళ్లు ఇచ్చారని, ఈ కాలంలో లక్షల్లో వడ్డీలు అయ్యాయని, అవన్నీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు.టిడ్కో లబ్దిదారుల రుణాలు రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. జగనన్న కాలనీల పేరు మారినా వాటి తీరు మారలేదన్నారు. కాలనీలను ప్రజాప్రతినిధులు సందర్శించాలని, అప్పుడే పేదల కష్టాలు తెలుస్తాయన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టినా మౌలిక వసతులు కల్పించకపోతే ఎలా జీవించాలని ప్రశ్నించారు. ఈ సమస్యలను గత ప్రభుత్వంగానీ, ప్రస్తుత ప్రభుత్వంగానీ పట్టించుకోవట్లేదన్నారు. సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్‌ ‌మాట్లాడుతూ నగరంలోని పేదలకు జగనన్న కాలనీల్లో67 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, దాదాపు 40వేల ఇళ్లు కట్టించారన్నారు. కానీ మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల వందల్లోనే నివాసం ఉంటున్నారన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టర్ల ద్వారా కట్టిన ఇళ్లు నాణ్యత లేక నెర్రెలు ఇస్తున్నాయన్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ ‌సౌకర్యం లేదన్నారు. కనీసం త్రాగునీరు కూడా అందుబాటులో లేదన్నారు.యుద్ధ ప్రాతిపతికన మరమ్మతులు చేయించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు.

Author
Share This Article
Leave a review