Amaravathi City News :గిరిజన విద్యార్థులకు రాష్ట్రపతిని కలిసే అరుదైన అవకాశం-సెప్టెంబర్ 15న ద్రౌపది ముర్ముతో భేటీ

Sharat
1 View

అమరావతి, సెప్టెంబరు 12: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గిరిజన విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు (EMRS)కు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారు.

సెప్టెంబర్ 15న విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌లోని అమృత్ ఉద్యాన్‌ను సందర్శించడంతో పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రత్యక్షంగా కలిసే అవకాశం పొందనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ (APTWREIS) కార్యదర్శి ఎం. గౌతమి తెలిపారు.Amaravathi News

విద్యార్థుల బృందం సెప్టెంబర్ 13న విజయవాడ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరనుంది. సెప్టెంబర్ 15న రాష్ట్రపతి భవన్, అమృత్ ఉద్యాన్ సందర్శన అనంతరం సెప్టెంబర్ 16న దేశ రాజధానిలోని పలు చారిత్రక, విద్యా, అధ్యయన ప్రాంతాలను సందర్శించనుంది. అనంతరం సెప్టెంబర్ 17న న్యూఢిల్లీ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం కానుంది.

విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించేందుకు ఒక మహిళా ఎస్కార్ట్ ఉపాధ్యాయురాలు కూడా బృందంతో పాటు వెళ్లనున్నారు.

దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసానికి ఈ పర్యటన దోహదపడుతుందని ఎం. గౌతమి తెలిపారు. సమాజంపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Author
Share This Article
Leave a review