GUNTUR DISTRICT NEWS: విఘ్న వారణం – విశ్వ కారణం – వినాయకుడికి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి విశేష పూజలు

Karthik

సమస్త వేదాలకు మూలమైన ఓంకార రూపం.. సకల దేవతా సమిష్టి స్వరూపం.. సర్వ విఘ్న సంహారం.. మహా గణపతి అవతారం” అని శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆయన అనాదిగా “విఘ్న వారణం – విశ్వ కారణం” అంటూ విశ్వ జనులచే విశిష్టమైన ఆది పూజలు అందుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.గుంటూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ప్రత్యేక మండపాలలో అనేక రూపాలలో కొలువైన బొజ్జ గణపయ్యను ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి దర్శించుకున్నారు. స్థానిక కేవీపీ కాలనీలో మాజీ కార్పొరేటర్ కాండ్రకుంట గురవయ్య, శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలలో పాల్గొని వినాయకుడికి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వమే గణేశ తత్వమని పేర్కొన్నారు. సర్వత్రా సమంగా వ్యాపించిన ఏకీకృత చైతన్యమే ఏకదంత వినాయకుడని తెలిపారు. అందరూ సమదృష్టిని అలవరచుకోవాలని చెప్పే సమిష్టి తత్వం అదేనన్నారు. వ్యక్తిలో శక్తిని, వ్యవస్థలో స్పూర్తిని నింపే సద్గుణ గణాలకు అధిపతి గణపతి అన్నారు. విఘ్నాన్నే ఆయుధంగా ప్రయోగించి ఏ కార్యాన్నైనా సానుకూలం చేయగల విజ్ఞుడు విఘ్న నాయకుడని లేళ్ళ అప్పిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, వైసీపీ రాష్ట్ర నేత నూనె ఉమామహేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, గేదెల రమేష్, పడాల సుబ్బారెడ్డి, రోషన్, పార్టీ నేతలు నాగేశ్వరరావు, కేతావత్ రవి, తిరుమలేశ్వరరావు, సాంబయ్య, పవన్, సుర్యానాయక్, అనిల్ నాయక్, మంత్రి మహానంది, జాన్, చిన్న, రేజేటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review