GUNTUR DISTRICT NEWS: గుంటూరులో సందడి చేసిన సినీ హీరో శ్రీకాంత్

Karthik

గుంటూరు నగరంలోని గోరంట్ల ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన తేజశ్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది శ్రీకాంత్‌కు ఘన స్వాగతం పలికారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన వివిధ విభాగాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్. కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ఎమ్మెల్యే మహ్మద్ నజీర్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తాను హాజరయ్యేలా చేయడంలో మస్తాన్ వలి కీలక పాత్ర పోషించారని చెప్పారు. మస్తాన్ వలి గతంలో ‘కేరర్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారని, అప్పటి నుంచి ఆయనతో పాటు ఆయన కుటుంబంతో తమకు మంచి పరిచయం ఉందని శ్రీకాంత్ గుర్తుచేశారు. మస్తాన్ వలి రాజకీయ, సినీ రంగాల్లో మరింతగా రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. తేజశ్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు. ఆసుపత్రిని ఏర్పాటు చేసిన డాక్టర్ తేజశ్వి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.గుంటూరు నగరంలో ఆధునిక వైద్య సదుపాయాలతో తేజశ్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పలువురు అతిథులు పేర్కొన్నారు. వివిధ వైద్య విభాగాల్లో నిపుణులైన వైద్యుల సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మహ్మద్ నజీర్, గల్లా మాధవి తదితర ప్రముఖులు పాల్గొని ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తేజశ్వి హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు.

Author
Share This Article
Leave a review