GUNTUR DISTRICT NEWS: ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సివి రామన్ ప్రతిభా పురస్కారాలు

Karthik

ఆంధ్రప్రదేశ్ లోని 28 జిల్లాలలో ప్రైవేట్ పాఠశాలలో లక్ష 30 వేల మంది ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్నారని వారిలో అత్యున్నత ప్రతిభ కనపరిచిన 80 మంది ఉపాధ్యాయులకు సివి రామన్ ప్రతిభా పురస్కారాలను శాసనమండలి మాజీ సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రధానం చేశారు. ఈనెల 28వ తేదీన మంగళవారం ఉదయం గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సి.వి.రామన్ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి అసోసియేషన్ కన్వీనర్ ఎం. సూర్యారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కె.యస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం పైగా విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలోనే విద్య అందుతుందని, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించాలని కోరారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని వారికోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్ష 30 వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని వీరిలో అత్యధికులకి కనీస వేతనం కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేసి 28 జిల్లాల నుండి ప్రైవేట్ ఉపాధ్యాయుల ప్రతినిధులను ఆహ్వానించి రాష్ట్ర కమిటీని రూపొందిస్తామని ప్రకటించారు. మరొ ముఖ్య అతిథిగా హాజరైన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ 1990 దశాబ్దంలో జరిగిన సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ సంఘటితమై ప్రైవేట్ యాజమాన్యులతో, రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. బోధన నైపుణ్యాలను మరింత పెంచుకుని అత్యుత్తమ విద్యను బాల బాలికలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి. నాగేశ్వరరావు, స్టూడెంట్స్ యూనియన్ ఫర్ నేషన్ యశ్వంత్, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు, ప్రైవేట్ ఉపాధ్యాయ ఉద్యమ నేతలు డా|| నాగయ్య, శ్రీనివాస్ రెడ్డి, శ్రీవాణి, శ్రీనివాస్, ముజీఫర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివి రామన్ ప్రతిభా పురస్కారాలు అందుకున్న 80 మంది ఉపాధ్యాయులకు ముఖ్య అతిథులు కె.ఎస్. లక్ష్మణరావు, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు శాలువాలు కప్పి మెమోటోలు అందించి ఘనంగా సత్కరించారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review