GUNTUR DISTRICT NEWS: పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత

Karthik

ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయపత్రాలను స్వయంగా అందించి, వారి ఆరోగ్య స్థితిగతులను, క్షేమ సమాచారాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అత్యుత్తమ వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ నిరుపేద కుటుంబం కూడా వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున సీఎంఆర్‌ఎఫ్ నిధులను మంజూరు చేస్తోందని కొనియాడారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రుల్లో చేరిన బాధితులకు తక్షణ అత్యవసర చికిత్సల కోసం ఎల్‌ఓసీలు (Letter of Credit) జారీ చేస్తూ, శస్త్ర చికిత్సల అనంతరం ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల రూపంలో నిధులు అందజేస్తూ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటోందని ఆయన చెప్పారు. ఈ విడత సీఎంఆర్‌ఎఫ్ సాయంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి కోటి మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. దీనిద్వారా మొత్తం 100 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందని, అందులో అత్యవసర వైద్యం కోసం 32 మందికి ఎల్‌ఓసీలు, అలాగే 68 మంది బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రత్తిపాడు నియోజకవర్గ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో మొత్తం 1381 మంది నిరుపేద బాధితులకు రూ.13.90 విలువైన ఉచిత వైద్య సహాయాన్ని అందించామని ఎమ్మెల్యే తెలిపారు.

Author
Share This Article
Leave a review