కుప్పం :-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ‘సూపర్ సిక్స్’ పథకాలైన తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సహా పలు సంక్షేమ ఫలాల ద్వారా లబ్ధిదారులకు చేకూరుతున్న ఆర్థిక వెసులుబాటు, కుటుంబ సాధికారతపై సీఎం నేరుగా మాట్లాడి వివరాలు ఆరా తీశారు.

పర్యటనలో భాగంగా కుప్పంలోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సంజీవని వైద్య సేవలు పొందుతున్న బాధితులతో పాటు స్థానిక ప్రజలతో సీఎం భేటీ అయ్యారు. పిఎమ్ఎవై (PMAY), ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు, సోలార్ రూఫ్‌టాప్స్, సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల పురోగతిపై లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.Amaravathi news
అధికారులకు స్పష్టమైన ఆదేశాలు:
- రోడ్ల నిర్మాణం & ప్లాంటేషన్: జల్ జీవన్ మిషన్ పనుల్లో భాగంగా కొత్త రోడ్లు వేయడానికి ముందే పైప్లైన్ల పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్ పెంచడంతో పాటు స్ట్రీట్ లైటింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
- జీరో పావర్టీ – P4 అమలు: ‘జీరో పావర్టీ’ సాధనలో భాగంగా P4 అమలు తీరుపై బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో సీఎం ప్రత్యేకంగా చర్చించారు. 2026 డిసెంబరు నాటికి కుప్పంలోని 8,904 బంగారు కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వ్యవసాయం – సుస్థిరాభివృద్ధిపై రైతులతో సుదీర్ఘ చర్చ:
అనంతరం వ్యవసాయం, ఉద్యానవనం, సెరీకల్చర్, పశుసంవర్ధక రంగాల అభివృద్ధిపై స్థానిక రైతులతో సీఎం సమావేశమయ్యారు.
- భూసారం, తేమ శాతాన్ని పెంచేందుకు ‘బయోచార్’ విధానాలను, వ్యర్థాల నిర్వహణను వేగవంతం చేయాలని కోరారు.
- ‘వీబీజీ రామ్‌జీ’ పథకం ద్వారా పశువుల దాణా కొరత లేకుండా చూస్తామని, ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు ‘పీఎండీఎస్’ సాగు పద్ధతులను పాటించాలని రైతులకు పిలుపునిచ్చారు.
- కుప్పంలో ఫ్లోరీకల్చర్ (పూల సాగు) ద్వారా మంచి ఆదాయం ఆర్జిస్తున్న రైతులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
‘నెట్ జీరో’ కుప్పం దిశగా అడుగులు – సీఎం కీలక వ్యాఖ్యలు:
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
“రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతోనే సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభించాం. ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేయడమే మా లక్ష్యం. యువత నైపుణ్యాలు పెంచుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలి.”
- సంజీవని ప్రాజెక్టు: కుప్పంలో పైలట్‌గా ప్రారంభించిన ‘సంజీవని’ పథకం దేశానికే మోడల్‌గా నిలుస్తోందని, త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి ప్రతి ఒక్కరి ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ తయారు చేస్తామని వెల్లడించారు.
- పర్యాటకాభివృద్ధి: కుప్పాన్ని సాహస క్రీడలైన రాక్ క్లైంబింగ్, బైకింగ్ వంటి క్రీడలకు కేరాఫ్‌గా మారుస్తూ బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
- కార్బన్ న్యూట్రల్ టార్గెట్: 2028 నాటికి కుప్పం నియోజకవర్గాన్ని పూర్తిగా ‘కార్బన్ న్యూట్రల్’ (నెట్ జీరో)గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రతి ఇంటిపైనా సౌర విద్యుత్ (సోలార్) ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
- నియోజకవర్గంలో 75-80 శాతం పచ్చదనాన్ని పెంపొందించి, వర్షపు నీటిని చెక్ డ్యామ్‌ల ద్వారా భూగర్భజలాలుగా మార్చాలని, వ్యర్థాలను కాంపోస్ట్‌గా మార్చి ‘స్వచ్ఛ-ఆరోగ్యకర కుప్పం’ సాధించాలని పిలుపునిచ్చారు.



