వారణాసి:– ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహించిన ‘వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు పంకజ్ చౌదరి తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమానికి ముందు చంద్రబాబు శ్రీ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, చిరాగ్ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలతో శ్రీ కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ పండితులు చంద్రబాబుకు ఆశీర్వచనం అందించగా, అర్చకులు ప్రసాదం అందించారు. కేంద్ర మంత్రులు, యూపీ సీఎంతో కలిసి చంద్రబాబు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.Amaravathi News
మోదీ నాయకత్వంలో అభివృద్ధి
శ్రీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. నరేంద్ర మోదీని చూసి దేశం గర్వపడుతోందని పేర్కొన్నారు. ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాలతో రాబోయే కాలంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబుకు ప్రత్యేక ప్రాధాన్యం
వారణాసి-వాద్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ గత జ్ఞాపకాలను గుర్తుచేశారు. చంద్రబాబు తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారని, కష్టసుఖాల్లో తన తండ్రికి అండగా నిలిచారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ తదితరులు పాల్గొన్నారు.



