విజయవాడ, సెప్టెంబర్ 17:– రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని ఎన్‌టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉన్న సెర్ప్ కార్యాలయంలో గురువారం సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, డైరెక్టర్లతో కలిసి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రంలోని 1,02,009 ఎస్‌హెచ్‌జీ సంఘాలకు రూ.15,054 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన రూ.36,000 కోట్ల రుణ లక్ష్యాన్ని పూర్తి చేసేలా బ్యాంకర్లతో సమన్వయం మరింత పెంచాలని మంత్రి ఆదేశించారు.
స్త్రీనిధి ద్వారా ఇప్పటివరకు 4.73 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.4,800 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. బ్యాంకులు మంజూరు చేసే క్యాష్ క్రెడిట్ రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీల మినహాయింపు నిబంధనలపై మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ అంశాన్ని గ్రామీణ సభలు, సమాఖ్యల నెలవారీ సమావేశాల అజెండాలో చేర్చాలని ఆదేశించారు.Vijayawada city News
ప్రతి ఎస్‌హెచ్‌జీ మహిళకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) ద్వారా వంద శాతం బీమా రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. జిల్లా సమాఖ్యల ఇన్సూరెన్స్ కాల్ సెంటర్ల ద్వారా బీమా క్లెయిమ్‌లను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎస్‌హెచ్‌జీ మహిళలు తయారు చేస్తున్న 65 రకాల ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి నాలుగు ‘స్వయం’ (SWAYAM) బ్రాండ్ సిగ్నేచర్ స్టోర్ల ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో జీవనోపాధి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధునిక లాండ్రీ, బ్యూటీ పార్లర్, హెయిర్ కటింగ్ తదితర వృత్తి నైపుణ్యాల్లో మహిళలకు, చేతివృత్తిదారులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
ఎఫ్‌పీఓల ఆధ్వర్యంలో నిర్వహించే కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా రైతులకు తక్కువ అద్దెకే వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. తద్వారా సాగు ఖర్చులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంత మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, వారి కుటుంబాలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించేలా సెర్ప్ అధికారులు పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.



