వారణాసి:– ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందీలో ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. కాశీ పవిత్ర భూమిపై నిలబడటం గర్వకారణమని పేర్కొన్నారు. దేశం మారుతోందని, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ‘నయా భారత్, ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంగా దేశం పయనిస్తోందని చెప్పారు.
‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్, వికసిత్ భారత్.. యహీ హమారా సంకల్ప్ హై’ అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. ఆయన ప్రసంగానికి సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.
మోదీ కర్మభూమి కాశీ
కాశీ క్షేత్రం ప్రధాని నరేంద్ర మోదీ కర్మభూమి అని చంద్రబాబు అన్నారు. వారణాసి నుంచి మోదీ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారని, కాశీ కేవలం ఒక ఎంపీని ఎన్నుకోవడమే కాకుండా దేశానికి ఒక నాయకుడిని అందించిందని పేర్కొన్నారు. మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.
‘వీకేఎస్’ అభివృద్ధి మంత్రంగా మారిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వాద్నగర్‌లోని ‘వి’, కాశీలోని ‘కె’, సెప్టెంబర్‌లోని ‘ఎస్’ కలిపి వీకేఎస్‌గా పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడమే మోదీ విధానమని అన్నారు.
పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం
మోదీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయని తెలిపారు. జల్ జీవన్ మిషన్, అమృత్ వంటి పథకాల ద్వారా కోట్లాది ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించారని చెప్పారు.Amaravathi city news
ఇవి కేవలం గణాంకాలు కాదని, వాటి వెనుక పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం, అభివృద్ధి ఉన్నాయని అన్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు.
కరోనా సమయంలో నాయకత్వం
ప్రపంచంలోని అనేక దేశాలు సంక్షోభంలో ఉన్న సమయంలో మోదీ దేశానికి నాయకత్వం వహించారని చంద్రబాబు అన్నారు. కరోనా సమయంలో దేశ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. 200 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికి ప్రోత్సాహం ఇచ్చారని, పలు దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేశారని తెలిపారు.
యువతకు అవకాశాలు
ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ గ్లోబల్ వంటి విధానాలతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని బలోపేతం చేశారని చంద్రబాబు అన్నారు. గతంలో రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునే భారత్.. ప్రస్తుతం ఎగుమతులు చేసే స్థాయికి చేరిందని పేర్కొన్నారు.
స్పేస్, డ్రోన్లు, క్వాంటం, సెమీకండక్టర్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై మోదీ దృష్టి సారించారని అన్నారు. గతంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువత.. ప్రస్తుతం స్టార్టప్‌ల ద్వారా ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరిందని తెలిపారు. దేశంలో 2.20 లక్షల స్టార్టప్‌లు ఉన్నాయని, అద్భుతమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
మహిళా సంక్షేమం, సాధికారత కోసం కేంద్రం పలు కార్యక్రమాలు చేపట్టిందని చంద్రబాబు అన్నారు. బేటీ బచావో–బేటీ పడావో, లఖ్‌పతి దీదీ, ఉజ్వల, ముద్ర, స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలను ప్రస్తావించారు. నారీ శక్తి అధినియం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్‌తో భారత్ శక్తి చాటింది
భారత్‌ను ప్రపంచంలో బలమైన దేశంగా నిలిపేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అభినందించారు.
తాను కూడా గతంలో నక్సలిజాన్ని ఎదుర్కొన్నానని, నక్సలైట్ల నుంచి ముప్పు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో నక్సలిజం, మావోయిజాన్ని అణచివేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.
అయోధ్యలో వెంకటేశ్వర ఆలయం
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తవడం చారిత్రాత్మక పరిణామమని చంద్రబాబు అన్నారు. త్రేతాయుగ దైవమైన శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.
నదుల అనుసంధానం అవసరం
దేశంలో ఒకే పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం, కనెక్టివిటీని పెంచడం, వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వంటి చర్యలు జరిగాయని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో బుల్లెట్ రైళ్ల ద్వారా రవాణా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
నదుల అనుసంధానం ఇంకా పెండింగ్‌లో ఉందని, బ్రహ్మపుత్ర, గంగ, మహానది, కావేరి, గోదావరి నదులను అనుసంధానం చేస్తే భారత్ మరింత శక్తివంతంగా మారుతుందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి
మోదీ సుదీర్ఘకాలంగా రాజకీయ, పరిపాలనా బాధ్యతల్లో కొనసాగడం సాధారణ విషయం కాదని చంద్రబాబు అన్నారు. సమాజాన్ని అధ్యయనం చేసి, దాని అవసరాలకు అనుగుణంగా పాలన చేపడుతున్నారని పేర్కొన్నారు.
2003లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమం ప్రస్తుతం గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని అన్నారు. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరిందని తెలిపారు.
‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్’ విధానమే మోదీ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్డీఏ ఐక్యతే దేశానికి బలం
భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధి, ఆత్మనిర్భరతే అందరి లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. సుస్థిరత వల్ల నమ్మకం, నమ్మకం వల్ల పెట్టుబడులు, పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు, ఉద్యోగాల వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
దేశాభివృద్ధికి సరైన సమయంలో సరైన నాయకత్వం అవసరమని, మోదీ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం మోదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఎన్డీఏ భాగస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ బలోపేతం చేస్తోందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ ఐక్యతే దేశానికి బలమని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి లభిస్తున్న సహకారాన్ని ఏపీ ప్రజలు ఎప్పటికీ మరువరని చంద్రబాబు అన్నారు.



