GUNTUR CITY NEWS: 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సత్కార కార్యక్రమం

Karthik

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని విద్యార్థులు నిరూపించారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థి, విద్యార్థినులతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి అభినందించారు. గతంలో తాను ప్రకటించినట్లుగానే అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను త్వరలో విహారయాత్రకు తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే మాధవి వెల్లడించారు. ఈ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమలో 600 మార్కులకు 585, 586 వరకు మార్కులు సాధించిన విద్యార్థులు ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఇంతటి ప్రతిభ కనబరచడం రాష్ట్ర విద్యా రంగంలో వచ్చిన సానుకూల మార్పుకు నిదర్శనమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఈ విజయానికి రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రధాన కారణమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, అంకితభావం పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.“ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఎవరికి తీసిపోరు. వారి శక్తి సామర్థ్యాలకు ఎలాంటి అడ్డంకులు లేవని ఈ విద్యార్థులు నిరూపించారు. బెంచీలు, పుస్తకాలు, బ్యాగులు మార్చడం మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తును మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. అదే నిజమైన విద్యా సంస్కరణ” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ, వారు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Author
Share This Article
Leave a review