ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 వేల 618 ఎకరాలలో 7 వేల 472 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మెగా గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని పౌర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈనెల 19వ తేదీన మంగళవారం ఉదయం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరికోసం? అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ అమరావతికి 35 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం ఉండగా,7 వేల 472 కోట్లతో 4 వేల 618 ఎకరాల విస్తీర్ణంలో మరొక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహించవలసిన అవసరం లేదన్నారు. బెంగుళూరు సచివాలయం నుండి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ కు 43 కిలోమీటర్లు, తెలంగాణ సచివాలయం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు కు 30 కిలోమీటర్లు, మహారాష్ట్ర సచివాలయం నుండి బొంబాయి ఎయిర్ పోర్ట్ కు 25 కిలోమీటర్ల దూరం ఉందని సోదహరంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు మరో 3 డొమిస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయని వాటిని బలోపేతం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలు తీరుతాయన్నారు. పిపిపి విధానంలో ఎల్ & టి కంపెనీ హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టును తీసుకుని ఆ అనంతరం 13 వేల కోట్ల అప్పులు, 2 వేల కోట్ల ఈక్వటి మరియు 14 వందల 58 కోట్ల వయోబిలిటీ గ్యాప్ ఫండ్ ను తెలంగాణ ప్రభుత్వం నుండి రాబట్టుకుని పరారయిందన్నారు. కావున పిపిపి పద్ధతిలో అమరావతి మెగా గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బడా పారిశ్రామిక వేత్తలకు అప్ప చెప్పినా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తారు అని తెలిపారు. హైదరాబాద్ 1591లో నిర్మాణం కాగా 1930లో బేగంపేట విమానాశ్రయం వచ్చిందని అనంతరం హైదరాబాద్ నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందడం వలన 2008లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించారని తెలిపారు. చెన్నై పట్నం 1639లో నిర్మించారని 1954లో మాత్రమే మద్రాస్ ఎయిర్ పోర్ట్ నిర్మించారని, 2023లో నూతన ఎయిర్ పోర్ట్ ప్రారంభమైందన్నారు. కావున అమరావతికి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేసి ఉపయోగించుకోవాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల మంది ప్రతి ఏడాది విమానాలలో పయనిస్తున్నారని అందులో 400 కోట్ల మంది అంతర్జాతీయ ప్రయాణికులని తెలిపారు. ఇండియాలో కేవలం 7 శాతం మాత్రమే విమానాలలో పయనిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 6 విమానాశ్రయాలలో ప్రతి ఏడాది 50 లక్షల మంది లోపు ప్రయాణికులు పయనిస్తున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో అతి తక్కువగా తలసరి ఆదాయం గల ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో అట్టడుగున ఉండి 14 లక్షల కోట్లకు పైగా అప్పులు పాలైన రాష్ట్రం అంతర్జాతీయ విమానాశ్రయాలు, బుల్లెట్ ట్రైన్స్, మెట్రో రైళ్ళు లాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం, నిరుపేదరికం తొలగింపు, అసమానతలపై దృష్టి పెట్టాలని కోరారు. ప్రముఖ వైద్యులు, బీపీ మండల్ సేన రాష్ట్ర అధ్యక్షులు డా|| ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 150 విమానాశ్రయాలలో దాదాపు 50 విమానాశ్రయాలు నష్టాలలో కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ లో 6 విమానాశ్రయాలలో విశాఖపట్నం మినహా మిగిలినవి అన్నీ నష్టాలలో ఉన్నాయన్నారు. 2.5 కోట్ల జనాభాతో ఆర్థిక రాజధానిగా కొనసాగుతున్న బొంబాయి లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 1800 ఎకరాలలో కొనసాగుతుండగా అమరావతిలో 4 వేల 618 ఎకరాలతో నిర్మించాలని ఎలా ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. అభూత కల్పనలతో, గ్రాఫిక్స్ లతో ప్రజలను మభ్యపెట్టి సహజ వనరులను, సమాజ సంపదను దుర్వినియోగం చేయవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు హితవు పలికారు. పారిశ్రామికీకరణ, టూరిజం, మేధోవలస బలంగా ఉన్న ప్రాంతాలలోనే విమానయాన ప్రయాణాలు వర్ధిల్లుతాయన్నారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ ప్రసంగిస్తూ 50 ఏళ్ల తర్వాత అవసరమయ్యే విమానాశ్రయం నేడు నిర్మించ తలపెట్టడం మంచిది కాదన్నారు. భూములను, సహజ వనరులను బడా కార్పొరేట్ శక్తులకు అందించి రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజిని, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, పూర్వ ప్రిన్సిపాల్స్ కె.సత్యనారాయణ రెడ్డి, ముప్పాళ్ళ ప్రసాద్,డా|| పి. ముత్యం, జన విజ్ఞాన వేదిక నేత టి.ఆర్.రమేష్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పూర్వ జనరల్ మేనేజర్ పి. వీరారెడ్డి, రిటైర్డ్ ఎస్పి కె.వి.చలపతిరావు, రైతు ఉద్యమ నేత కొల్లి రంగారెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్ అడపా వేణుగోపాల్, పూర్వ కస్టమ్స్ అధికారి జక్కరయ్య తదితరులు ప్రసంగించారు.
AP LATEST NEWS: అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆలోచనను విరమించండి – పౌర సంస్థల విజ్ఞప్తి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
27°C
Vijayawada
light rain
27° _ 27°
92%
1 km/h
Fri
32 °C
Sat
30 °C
Sun
27 °C


