Visakha City news :విశాఖలో ఘనంగా ప్రారంభమైన 41వ ఐఏటీఓ జాతీయ సదస్సు

Sharat
1 View

విశాఖపట్నం, సెప్టెంబర్ 10:-ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. భారతదేశంలో ఇన్‌బౌండ్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘ఇండియా–ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ’ థీమ్‌తో విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) జాతీయ సదస్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై సదస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో IATO మాన్యువల్ బుక్‌ను ఆవిష్కరించడంతో పాటు 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఏపీ పర్యాటక శాఖ రూపొందించిన ‘ది గోదావరి కాల్స్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఏపీ పర్యాటకానికి విస్తృత అవకాశాలు

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి, వారసత్వం కలగలిసిన అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చిన టూర్ ఆపరేటర్లు ఏపీని సందర్శించి రాష్ట్రంలోని పర్యాటక అవకాశాలను స్వయంగా తెలుసుకోవాలని కోరారు.

ఏపీలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయిలో ప్రచారం చేసేందుకు టూర్ ఆపరేటర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా 2, 3, 4, 7 రోజుల ప్రత్యేక ఏపీ టూరిజం ప్యాకేజీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిందని, 2024–29 నూతన పర్యాటక పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు పలు రాయితీలు అందిస్తున్నామని తెలిపారు. క్యారవాన్, హోమ్‌స్టే, ల్యాండ్ అలాట్‌మెంట్, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ వంటి అనుబంధ విధానాల ద్వారా గత రెండేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.20 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.

పాలసీ, ప్రాసెస్, పార్ట్‌నర్‌షిప్, ప్రాజెక్ట్స్, ప్రమోషన్, ప్రొడక్ట్స్ అనే ఆరు ప్రధాన సూత్రాల ఆధారంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వెల్‌నెస్, ఎకో, అడ్వెంచర్, హెలీ, సీప్లేన్ టూరిజం వంటి నూతన పర్యాటక విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

1058 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరాన్ని ఉపయోగించుకుని యోగా, ఆయుర్వేద ఆధారిత వెల్‌నెస్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అరకు, లంబసింగి, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

గోదావరి పుష్కరాలకు 7 పర్యాటక సర్క్యూట్లు

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక అనుభూతిని అందించేలా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఏడు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను రూపొందించినట్లు వెల్లడించారు.

పంచారామ క్షేత్రాలు, శక్తిపీఠాలు, దేవీ క్షేత్రాలు, వైష్ణవ దివ్య క్షేత్రాలు, గోదావరి హెరిటేజ్ టెంపుల్స్, పుష్కర్ ఘాట్స్, అఖండ గోదావరి ప్రాంతాలను ఈ సర్క్యూట్లలో అనుసంధానించినట్లు తెలిపారు.

హేవలాక్ వంతెన, పాపికొండల పడవ ప్రయాణం, పుష్కర్ ఘాట్లు, హారతి కార్యక్రమాలతో పాటు అంతర్వేది, వాడపల్లి, అప్పనపల్లి, మందపల్లి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి స్తంభాలు

పర్యాటక రంగంలో టూర్ ఆపరేటర్ల పాత్ర కీలకమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. టూర్ ఆపరేటర్లను పర్యాటక రంగానికి అసలైన స్తంభాలుగా అభివర్ణించారు. పర్యాటక ప్రాంతాల్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యాటక అనుభవాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.

‘ప్రచారం నుంచి వ్యాపారం.. పర్యాటకం నుంచి స్థానిక ఆర్థికాభివృద్ధి’ అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

మంత్రి దుర్గేష్‌పై రామ్మోహన్ నాయుడు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సరైన సమయంలో సమర్థవంతమైన వ్యక్తి చేతిలో ఉందంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంత్రి కందుల దుర్గేష్‌ను ప్రశంసించారు. ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు చేపడుతున్నారని అభినందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక వనరులు పుష్కలంగా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు మెరుగైన విమాన అనుసంధానం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాలకు విమాన సదుపాయాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుతో పాటు సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. ఏపీ పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ రాష్ట్రంలోని పర్యాటక వనరులు, మౌలిక వసతులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై సదస్సులో వివరాలు వెల్లడించారు.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పర్యాటక పాలసీ 2024–29 పెట్టుబడిదారులు, టూర్ ఆపరేటర్లకు అనుకూలంగా ఉందని IATO ప్రతినిధులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏపీలోని తీర ప్రాంతాలు, అరకు, పాపికొండలు, గోదావరి పుష్కరాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించి దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన IATO ప్రతినిధులు, టూర్ ఆపరేటర్లను పర్యాటక శాఖ అధికారులు సత్కరించారు. అనంతరం ఏపీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ టీడీసీ ఛైర్మన్ నీలూ శర్మ, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పట్టాన్ శెట్టి రవి సుభాష్, విశాఖపట్నం ఇన్‌చార్జి కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, IATO ప్రెసిడెంట్ రవి గోసేన్, ఛైర్మన్ సునీల్ మిశ్రా, ప్రతినిధులు రాజ్ నిష్ కైస్తా, సంజయ్ రాజ్దాన్, దీపక్ కుమార్ భట్నాగర్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన టూర్ ఆపరేటర్లు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review