ఏలూరు, సెప్టెంబరు 10:– ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్. శ్రీదేవి తెలిపారు. జాతీయ న్యాయసేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈనెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 10,577 రాజీయోగ్యమైన కేసులను గుర్తించినట్లు వెల్లడించారు.
పెండింగ్‌లో ఉన్న రాజీయోగ్యమైన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు నేరుగా సంబంధిత కోర్టులను సంప్రదించవచ్చని, లేదా తమ న్యాయవాదుల ద్వారా కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.
గత జులైలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 7,910 కేసులను పరిష్కరించినట్లు శ్రీదేవి తెలిపారు. ఈసారి కూడా పెండింగ్‌లో ఉన్న రాజీయోగ్యమైన కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకునేలా కక్షిదారులు ముందుకు రావాలని కోరారు.
లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా కేసుల పరిష్కారానికి అవకాశం ఉన్నందున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్. శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.



