GUNTUR DISTRICT NEWS: వరద హెచ్చరిక – అప్రమత్తంగా ఉండాలి

Karthik

ప్రస్తుత అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా ప్రకాశం బ్యారేజీ పూర్తి స్థాయి నీటిమట్టానికి (FRL) చేరుకుందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. గురువారం (ఈ రోజు) సాయంత్రం 7:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల మధ్య బ్యారేజీ గేట్లను తెరిచి, కృష్ణా నదిలోకి దిగువకు గరిష్ఠంగా 10 వేల క్యూసెక్కుల మిగులు నీటిని విడుదల చేయడానికి ప్రతిపాదించారన్నారు. తద్వారా కృష్ణా నది పరీవాహ ప్రాంతాలైన తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సంబంధిత తహసీల్దార్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు ప్రజలను, నిర్మాణ పనుల ప్రదేశాలను, ఇతర సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేసి, ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. నీటి ప్రవాహం ఉండే ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా చూడాలని, నదీ ప్రవాహాన్ని దాటుటకు ఎవరు ప్రయత్నించకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని కోరారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Author
Share This Article
Leave a review