GUNTUR DISTRICT NEWS: నిత్య యోగా సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది

Karthik

ప్రజల దైనందిత జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. 15 రోజుల యోగ ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. తొలుత యోగ శాస్త్ర పితామహుడు మహర్షి పతంజలి చిత్రపటానికి పూలమాలవేసి, యోగ గురువులతో కలసి జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన అలవాట్ల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన సాధనం యోగ యని, వివిధ దేశాల ప్రజలు యోగాను ఆచరిస్తున్న పరిస్థితుల్లో గుంటూరు జిల్లా ప్రజలు కూడా ప్రతిరోజు వారి దినచర్యలో భాగంగా యోగాన్ని మలుచుకోవటానికి ప్రయత్నించాలన్నారు. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యం తో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంచుతుందన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. యోగా అనేది కేవలం కొన్ని ఆసనాలకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. నిత్యం యోగా సాధన వల్ల ఒత్తిడి లేని ఉత్సాహభరితమైన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. యోగాను మన పూర్వీకులు అందించిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వంగా పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు, సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాణాయామం వంటి యోగా సాధనలు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. యోగా గురువు విజయ గౌరి సూర్య మంత్రంతో సూర్య నమస్కారాలు, యోగా ద్వారా సమతుల్య ఆహారం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ప్రదర్శించారు. ఆయుష్మాన్. శాఖ అధికారి జి విజయానంద్ కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు చేయించారు. కార్యక్రమం అనంతరము యోగా గురువు విజయ గౌరి మరియు ఆయుష్మాన్ శాఖ అధికారి జి.రామానంద్ లను జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డా.విజయలక్ష్మీ , జిల్లా పర్యాటక అధికారి రమ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review