విజయవాడ, ఆగస్టు 1 : నీట్-యూజీ 2026 ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి పులాల చంద్రశేఖర్ తెలిపారు.
తొలి విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 4 నుంచి 17 వరకు జరగనుండగా, చేరిన అభ్యర్థుల వివరాల ధృవీకరణ ఆగస్టు 23న నిర్వహించనున్నారు. రాష్ట్ర కోటా తొలి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు కొనసాగనుండగా, రాష్ట్రస్థాయి ధృవీకరణ ఆగస్టు 29న చేపట్టనున్నారు. తొలి విడతలో అఖిల భారత కోటా అభ్యర్థులు ఆగస్టు 22లోపు, రాష్ట్ర కోటా అభ్యర్థులు ఆగస్టు 28లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
రెండో విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ విడతలో అఖిల భారత కోటా అభ్యర్థులు సెప్టెంబర్ 8లోపు, రాష్ట్ర కోటా అభ్యర్థులు సెప్టెంబర్ 14లోపు చేరిక పూర్తి చేయాల్సి ఉంటుంది.
మూడో విడత అఖిల భారత కోటా కౌన్సెలింగ్ సెప్టెంబర్ 10 నుంచి 18 వరకు, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు జరగనుంది. మూడో విడతలో అఖిల భారత కోటా అభ్యర్థులు సెప్టెంబర్ 26లోపు, రాష్ట్ర కోటా అభ్యర్థులు అక్టోబర్ 1లోపు కళాశాలల్లో చేరాలి.
స్ట్రే వేకెన్సీ రౌండ్ అఖిల భారత కోటాలో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు, రాష్ట్ర కోటాలో అక్టోబర్ 3 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. ఈ రౌండ్లో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 10లోపు తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది.
నీట్-యూజీ 2026 ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సమయం పరిమితంగా ఉండటంతో అన్ని శనివారాలు, ఆదివారాలు, గెజిటెడ్ సెలవు దినాలను కూడా పని దినాలుగా పరిగణించాలని అన్ని వైద్య కళాశాలలు, సంబంధిత సంస్థలకు సూచించినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది.
కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యార్థులు నిర్దేశిత తేదీలను తప్పనిసరిగా పాటించాలని, గడువులు ముగిసిన తర్వాత అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున అవసరమైన ధ్రువపత్రాలు, ఇతర పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.



