బాపట్ల, సెప్టెంబర్ 25: ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదిగి ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. బాపట్లలోని శ్రీ సాయిరాం గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.Bapatla City News
ఈ సందర్భంగా తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక ప్రగతి వేగంగా కొనసాగుతోందన్నారు. 2014లో ప్రపంచ దేశాల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 4వ స్థానానికి చేరిందని, భవిష్యత్‌లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ‘పి4’, ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. విశ్వకర్మ, స్వనిధి, బ్యాంకు లింకేజీ వంటి పథకాల ద్వారా రుణాలు పొందేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్లను సులభతరం చేసినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ప్రతి కుటుంబం నుంచి ఒక సూక్ష్మ పారిశ్రామికవేత్తగా ఎదగాలని సూచించారు.
బాపట్ల జిల్లాలో ఇప్పటికే సుమారు 25 వేల ఎంఎస్‌ఎంఈలు నమోదు అయ్యాయని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 50 వేలకు చేరేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. వ్యాపారాన్ని ఒకేసారి పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన కాకుండా దశలవారీగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. వ్యాపారానికి స్పష్టమైన ఆలోచన, ప్రణాళిక అవసరమన్నారు.
వ్యవసాయం, పర్యాటకం, ఆక్వా, ఉద్యానవన రంగాల్లో బాపట్ల జిల్లాలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చిన్న స్థాయి యూనిట్లతో ప్రారంభించి లక్షల రూపాయల వ్యాపారం నుంచి కోట్ల రూపాయల స్థాయికి ఎదగాలని ఔత్సాహికులకు సూచించారు.
ప్రతి కుటుంబం ఒక కర్మాగారం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఒక కర్మాగారంగా మారాలని అన్నారు. కుటుంబం నుంచి కనీసం ఒకరు స్వయం ఉపాధి లేదా పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా తమలోని నైపుణ్యాలను గుర్తించి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, శిక్షణ, సాంకేతిక సహాయం తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
వ్యాపార ఆలోచనను కార్యాచరణ ప్రణాళికగా మార్చుకుని, మార్కెట్ అవసరాలను అధ్యయనం చేసి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వర్క్‌షాప్‌లో వ్యాపార ఆలోచన ఎంపిక, ప్రాజెక్టు నివేదిక తయారీ, పెట్టుబడుల సమీకరణ, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెటింగ్, బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ, నాణ్యత ప్రమాణాలపై నిపుణులు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
బాపట్ల జిల్లాలో వ్యవసాయం, మత్స్య రంగాలు ఇప్పటికే అభివృద్ధి చెందాయని, పర్యాటక, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా విస్తరిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఆర్థికంగా బాపట్ల జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు.
యువత సోషల్ మీడియాను కేవలం వినోదం కోసం కాకుండా వ్యాపార, ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌తో పాటు లింక్డ్‌ఇన్ వంటి వేదికలను వినియోగించుకోవాలని, వాటి ద్వారా కంపెనీలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఇంజనీరింగ్ విద్యార్థులకు సూచించారు.
అక్టోబర్ 16న అమరావతి ప్రాంతంలో జరిగే ఎంఎస్‌ఎంఈ వర్క్‌షాప్‌కు ఔత్సాహికులను, మంచి వ్యాపార ఆలోచనలు కలిగిన వారిని తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొని వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందన్నారు. మంచి వ్యాపార ఆలోచనలు కలిగిన విద్యార్థులను ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ వర్క్‌షాప్‌ల ద్వారా ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. పరిశ్రమల స్థాపనపై ఔత్సాహికులకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు.
చేపట్టే పనిపై స్పష్టత ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల రుణాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. విద్యార్థులు ఉన్నతంగా ఆలోచించి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు.
వ్యవసాయం, పర్యాటకం, విద్య, ఆక్వా రంగాల్లో బాపట్ల జిల్లా అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వ్యాపారంలో ఎదురయ్యే కష్టనష్టాలను అధిగమిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
36 మందికి రూ.2.31 కోట్ల రుణాలు
కార్యక్రమంలో భాగంగా 36 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మొత్తం రూ.2.31 కోట్ల రుణ మంజూరు పత్రాలను అందజేశారు. యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల ద్వారా మంజూరైన రుణ పత్రాలను తెన్నేటి కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వై. రామకృష్ణ, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు, డీఆర్‌డీఏ పీడీ సింగయ్య, మెప్మా పీడీ ఆనంద్ పాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.



