మచిలీపట్నం:– కృష్ణా యూనివర్సిటీ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. విశ్వవిద్యాలయ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరించేందుకు మచిలీపట్నం సౌత్ మండలం రుద్రవరం గ్రామ పరిధిలోని 102.85 ఎకరాల ప్రభుత్వ భూమిని కృష్ణా యూనివర్సిటీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.603 జారీ చేసింది.
విశ్వవిద్యాలయ విస్తరణకు భూమి అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. భూమి కేటాయింపుతో వర్సిటీ అభివృద్ధికి మరింత విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ భూమిలో దశలవారీగా విశ్వవిద్యాలయ భవనాలు, పరిశోధనా కేంద్రాలు, విద్యార్థుల సదుపాయాలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు వీసీ కూన రామ్ జీ తెలిపారు.Machilipatnam distric News
భూమి కేటాయింపు నిర్ణయం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు. 102.85 ఎకరాల భూమి కేటాయింపు కృష్ణా యూనివర్సిటీ భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ఈ భూమి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ప్రభుత్వం, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు
కృష్ణా యూనివర్సిటీ అభివృద్ధికి సానుకూలంగా స్పందించి భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వీసీ కూన రామ్ జీ కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత విద్య, విశ్వవిద్యాలయాల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ నిర్ణయం నిదర్శనమని పేర్కొన్నారు.
భూమి కేటాయింపు ప్రక్రియలో సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగానికి కూడా వీసీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కృష్ణా యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేసి విద్యా, పరిశోధన రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు.
విద్యా–పరిశోధన కేంద్రంగా అభివృద్ధి
ప్రభుత్వం కేటాయించిన భూమిని నిర్దేశిత ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకుని కృష్ణా యూనివర్సిటీని నాణ్యమైన ఉన్నత విద్య, పరిశోధన, ఆధునిక మౌలిక వసతులకు కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వీసీ తెలిపారు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు, పరిశోధకులకు మెరుగైన వసతులు, అధ్యాపకులకు అనువైన విద్యా వాతావరణం కల్పించేలా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన 102.85 ఎకరాల భూమిని మూడు సంవత్సరాల్లో నిర్దేశిత ప్రయోజనం కోసం వినియోగించాల్సి ఉంటుంది.



