Guntur City News :రాష్ట్రాభివృద్ధిలో విద్య కీలక పాత్ర-నవ్యాంధ్ర నిర్మాణంలో గురుకుల ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా పనిచేయాలి-రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ

S Sarath
1 View

గుంటూరు:-రాష్ట్రాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో గురుకుల ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేస్తూ విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, విద్యావేత్త భాష్యం రామకృష్ణ అన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న హిందూ ఇంజినీరింగ్ కళాశాల సుధర్మ సమావేశ మందిరంలో వి.ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి రాష్ట్రస్థాయి ఉత్తమ గురుకుల ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాష్యం రామకృష్ణ ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజం, వ్యవస్థ, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే నాణ్యమైన విద్యతో ఉత్తమ పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని సూచించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆశిస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడిగా తన ఎంపికను ఉపాధ్యాయ వృత్తికి లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.Guntur District news

పార్లమెంట్ సభ్యుడిగా తనకు కేటాయించే ఎంపీ నిధులను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వినియోగించాలనే సంకల్పంతో ఉన్నట్లు వెల్లడించారు. విద్యా రంగం బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

గత ఐదేళ్లుగా వి.ఎస్.ఆర్. ఫౌండేషన్ గురుకుల పాఠశాలల్లో విశిష్ట సేవలందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులతో సత్కరించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది అంకితభావంతో పనిచేసేందుకు ప్రేరణ కలుగుతుందని తెలిపారు.

అనంతరం రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఎంపికైన 13 మంది ఉత్తమ గురుకుల ఉపాధ్యాయులను అతిథులు శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ భీమినేని వందనా దేవి, డాక్టర్ హిమబిందు, కొండలరావు, గోవింద్ రెడ్డి, చంద్రశేఖర్, రాఘవ శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review