Tirupathi district City News :వెంకటగిరిలో జనసేనకు రాజీనామా చేసిన గూడూరు వెంకటేశ్వరరావు-పార్టీ కోసం పదేళ్లుగా పనిచేశా.. తగిన గుర్తింపు లభించలేదు

S Sarath
1 View

వెంకటగిరి, అక్టోబర్ 15:– జనసేన పార్టీ కోసం గత పదేళ్లుగా పనిచేసిన గూడూరు వెంకటేశ్వరరావు (GVR-PV) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తాను నిర్వహిస్తున్న పార్టీ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకత్వం, ఇటీవల ప్రకటించిన కమిటీల్లో తన సేవలకు తగిన గుర్తింపు లభించకపోవడం, రాజకీయ ప్రయాణంలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా గూడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 2016లో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన శక్తిమేరకు కృషి చేశానని, పార్టీ అప్పగించిన బాధ్యతల్లో భాగంగా నియోజకవర్గ పీవోసీగా, ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని పేర్కొన్నారు.

గత మున్సిపల్ ఎన్నికల సమయంలో పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు, ఇద్దరు జెడ్పీటీసీ అభ్యర్థులు, పలువురు సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేసేలా తన వంతు సహకారం అందించానని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలను సమన్వయం చేస్తూ, అభ్యర్థులకు అండగా నిలిచానని వివరించారు.Dwarkathirumala: చిన్న తిరుపతిలో భక్తి వెలుగులు… ద్వారకాతిరుమలలో బ్రహ్మోత్సవాల వైభవం

అయితే, తన రాజకీయ ప్రయాణంలో కొందరి నుంచి ఆరోపణలు, వేధింపులు ఎదుర్కోవాల్సి రావడం తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో తన గత సేవలు, అనుభవానికి తగిన గుర్తింపు లభించకపోవడం మరింత నిరాశకు గురిచేసిందన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తల సేవలను గుర్తించి, వారికి తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తాను పదవుల కోసం కాకుండా పార్టీ అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా పనిచేశానని గూడూరు వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అయినప్పటికీ తన కృషికి తగిన గుర్తింపు లభించకపోవడంతో ఆత్మపరిశీలన చేసుకుని రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన నిర్ణయానికి గల కారణాలను పార్టీ అధిష్ఠానం, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

ఈ రాజీనామా నిర్ణయం వ్యక్తిగత ద్వేషంతో తీసుకున్నది కాదని, తన అనుభవాలు, ఆవేదన, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. జనసేన పార్టీ నుంచి వైదొలిగినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాసేవ పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని గూడూరు వెంకటేశ్వరరావు తెలిపారు.

Author
Share This Article
Leave a review