దర్శి, అక్టోబర్ 15:– ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో ఎన్ఎస్పీ కాలనీ వద్ద వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఐదో రోజు అమ్మవారు కాళికాదేవి మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున వేద పండితులు అమ్మవారికి వివిధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం కాళికాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఉంచి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సేవలో భక్తులు పొంగళ్లను తలపై పెట్టుకుని అమ్మవారి పల్లకి వెంట నడిచారు. భాజా భజంత్రీలు, డప్పుల మోతలు, అమ్మవారి భజన పాటలు, భక్తి గీతాల నడుమ భక్తులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ దేవస్థానం చుట్టూ పల్లకి సేవలో పాల్గొన్నారు. భక్తులు తీసుకొచ్చిన పొంగళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.
భక్తులకు అన్నదానం
మధ్యాహ్నం దేవస్థానానికి వచ్చిన భక్తులకు దర్శి పట్టణానికి చెందిన పటాపంచల శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు, కర్ణ బ్రహ్మారెడ్డి, సుబ్బులు దంపతులు, పప్పుల ఆదినారాయణరెడ్డి, భారతి దంపతుల కుటుంబ సభ్యులు అన్నవితరణ నిర్వహించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.Prakasam District news
ప్రతిరోజూ భజన కార్యక్రమాలు.. భక్తులకు బహుమతులు
దేవస్థానంలో ప్రతి రోజు రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు లాటరీ పద్ధతి ద్వారా వివిధ రకాల బహుమతులను అందజేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పూజలు, పల్లకి సేవ, అన్నవితరణ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు.



