దీపావళి సామగ్రి విక్రయాలలో భద్రతే ప్రదానమని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ స్పష్టం చేశారు. దీపావళి సామగ్రి విక్రయాల దుకాణాలు ఏర్పాటు, భద్రతపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సామగ్రి విక్రయాలకు సురక్షిత అవకాశాలు ఉన్న మైదానాలను గుర్తించాలని ఆదేశించారు. గుంటూరు నగరంలో విక్రయాలు ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించే బాధ్యత నగర పాలక సంస్థ కమిషనర్ తీసుకోవాలని అన్నారు. ఎక్కడా అనుమతికి మించి నిలువలు ఉండరాదని స్పష్టం చేశారు. దుకాణాలు ఏర్పాటులో అత్యంత జాగరూకత వహించాలని, అగ్ని ప్రమాదాలు, పేలుడు వంటి సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు. దుకాణాలు సాధ్యమైనంత మేర నిర్ణీత దూరం పాటించాలని, ప్రజలు వచ్చుటకు, వెళ్ళుటకు ఎటువంటి రద్దీ లేకుండా మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దుకాణాలు ఏర్పాటుకు ఒకే చోట అనుమతులు ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచించారు. *కాలుష్యంలేని దీపావళి జరుపుకుందాం*కాలుష్యంలేని దీపావళి జరుపుటకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. నగరాల్లో ఇప్పటికే కాలుష్యం ఎక్కువగా ఉందని, దీపావళి రోజున లక్షలాది ప్రజలు పండగ జరుపుకోవడం వలన టపాసులతో ఎక్కువ పొగ వచ్చి మరింత కాలుష్యం పెరుగుతుందని చెప్పారు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరుగుతుందని దీనిని ప్రజలు గమనించి వాయు, శబ్ద కాలుష్యం నియంత్రణకు తోడ్పడాలని అన్నారు. పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ దీపావళి సామగ్రి నిలువ ఉన్న భవనాలు, ప్రదేశాల వద్ద విద్యుత్ వైరింగ్, అగ్ని ప్రమాద కారకాలు లేకుండా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



