GUNTUR DISTRICT NEWS: కౌంటింగ్, పంపిణీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

Karthik

తెనాలి పురపాలక ఎన్నికల కౌంటింగ్, సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలనుజిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. జె.ఎం.జె కళాశాల, నన్నపనేని వెంకటరావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కౌంటింగ్, సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు గుర్తించడం జరిగిందని తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పల నాయుడు తెలిపారు. ఎన్నికల సామగ్రి పంపిణీ పక్కాగా జరగాలని ఆదేశించారు. వార్డుల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేస్తూ సంబంధిత కౌంటర్లలో స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ సామాగ్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు  ప్రతి కౌంటర్ వద్ద తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పంపిణీ కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటన్నింటిని ముందుగానే చెక్ లిఫ్ట్ ఆధారంగా పరిశీలించుకోవాలని తెలిపారు. పోలింగ్ నిర్వహణ అనంతరం సంబంధిత పోలింగ్ కేంద్రాల నుండి వచ్చే సామాగ్రి స్వీకరణ సైతం క్రమ పద్ధతిలో జరగాలని స్పష్టం చేశారు. ఎన్నికల స్వీకరణకు వార్డుల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలని అన్నారు. స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ, ఇతర సామగ్రి సేకరణ తదితర అంశాలను విభజించుకుంటూ ప్రతి అంశాన్ని పరిశీలించి స్వీకరించాలని ఆదేశించారు. సామాగ్రి పంపిణీ, స్వీకరణ సిబ్బందికి ముందుగానే శిక్షణ నిర్వహించాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో కౌంటింగ్ ఏజెంట్లు ఉండుటకు, కౌంటింగ్ జరుగుటకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో బెంచీల ఏర్పాటు పర్యవేక్షణ జరగాలని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు, రిటర్నింగ్ అధికారుల కూర్చునే ఏర్పాటు తదితర ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఎవరు ప్రవేశించవచ్చు, ఎవరు ప్రవేశించ రాదు వంటి అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘ మార్గదర్శకాలను, నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రతీ ఒక్కరూ పక్కాగా పాటించాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించినా, ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా, వాటిపై ఫిర్యాదులు చేసేందుకు లేదా వివరాలు తెలుసుకునేందుకు 08632 234014 హెల్ప్‌డెస్క్/కాల్ సెంటర్ ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చని చెప్పారు. *ఎన్నికల వేళ మద్యం దుకాణాలు బంద్* ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరుపుటకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. పోలింగ్ ముగిసేందుకు నిర్ణయించిన గడువుకు ముందు ఉండే 48 గంటల కాలంలోను,  ఓట్ల లెక్కింపు రోజున సంబంధిత పోలింగ్ పరిధిలోని ప్రాంతాల్లో అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా రెవెన్యూ, ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి,  జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, తెనాలి ఎంపీటీసీ రిటర్నింగ్ అధికారి కే దుర్గాబాయి, తెనాలి డీఎస్పీ బి. జనార్ధన రావు, తహసిల్దార్ గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review