Guntur District City News :శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసుల పాత్ర కీలకం-బాధితులకు భరోసా.. నేరస్తులకు పోలీసులంటే భయం కలగాలి-రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించొద్దు.. సైబర్‌ నేరాల కట్టడికి ఆధునిక సాంకేతికత వినియోగించాలి

S Sarath
2 Views

మంగళగిరి, అక్టోబరు 21:– రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు శాఖకు సూచించారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, బాధితులకు భరోసా ఏర్పడాలని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జీవించేలా పోలీసులు విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో బుధవారం నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పోలీసు అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఖాకీ అంటే బాధ్యతకు, పోలీసు అంటే భరోసాకు ప్రతీక అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు పోలీసులు ధైర్యాన్ని అందించాలని సూచించారు.

ప్రమాదం జరిగినా, నేరం చోటుచేసుకున్నా ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని చంద్రబాబు అన్నారు. ప్రజలు తమ ఇళ్లలో పండుగలు జరుపుకొనేందుకు పోలీసులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విజయవాడలో దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌, వీఐపీల భద్రతతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు చేసిన కృషిని అభినందించారు.

1959 అక్టోబరు 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని ఎదుర్కొంటూ పది మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలకు గుర్తుగా ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని సీఎం వివరించారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.NTR District news

శాంతిభద్రతలతోనే పెట్టుబడులు, ఉపాధి

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని చంద్రబాబు అన్నారు. గతంలో ఫ్యాక్షన్‌ నియంత్రణ, నక్సలిజం ఎదుర్కోవడం, మత కలహాలను అరికట్టడంలో పోలీసులు ధైర్యసాహసాలు ప్రదర్శించారని గుర్తుచేశారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని తెలిపారు.

భద్రతపై నమ్మకం ఉన్న ప్రాంతాలకే పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అందుకే తాను అధికారంలో ఉన్న ప్రతిసారీ శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే కుట్రలను ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఛేదించడం అభినందనీయమన్నారు.

పోలీసు విధుల్లో ధైర్యంతోపాటు మానవత్వం కూడా అవసరమని సీఎం సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను సానుభూతితో వినాలని, గౌరవంగా వ్యవహరించి సత్వర పరిష్కారం చూపాలని కోరారు. పోలీసుల తక్షణ స్పందన ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని పేర్కొన్నారు.

రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయాలు నేరస్థులకు రక్షణగా మారకూడదన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ మూకలు, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రప్పా రప్పా అంటూ రౌడీయిజానికి పాల్పడితే అణచివేయాలని సూచించారు.

సైబర్‌ నేరాల కట్టడికి సాంకేతికత

మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసుల దర్యాప్తు విధానాల్లోనూ మార్పులు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. ఒక్క ఫోన్‌కాల్‌, లింక్‌ లేదా సందేశంతో సైబర్‌ నేరగాళ్లు ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు సైతం సైబర్‌ మోసాలకు బలవుతున్నారని తెలిపారు.

నేరాలను ఛేదించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమైతే, నేరాలు జరగకుండా ముందుగానే అడ్డుకోవడం అత్యుత్తమ పోలీసింగ్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను గుర్తించడంతోపాటు, డేటా విశ్లేషణ ద్వారా నేరాల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని సూచించారు. నిఘా వ్యవస్థలో డ్రోన్ల వినియోగాన్ని విస్తరించాలని, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ఈగల్‌ బృందం చేస్తున్న కృషిని అభినందించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మహిళలకు భద్రత కల్పించలేకపోతే ప్రయోజనం లేదని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిలో చట్టంపై భయం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో చర్యలు

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని చంద్రబాబు అన్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం, పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని పేర్కొన్నారు.

తీవ్ర ఒత్తిడితో పనిచేసే పోలీసులు యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

అమరవీరుల త్యాగాలకు నిజమైన నివాళి అర్పించాలంటే ప్రజలకు నిరంతరం భద్రత కల్పించడమే మార్గమని సీఎం పేర్కొన్నారు.

అమరవీరులకు నివాళులు

కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా తదితరులు అమరవీరుల స్మృతిచిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. షహీద్‌ పుస్తక్‌ టోలీ, అమరుల పుస్తకాలను ఆవిష్కరించారు. పోలీసు సంస్మరణ నిధికి ముఖ్యమంత్రి విరాళం అందించారు.

అనంతరం పోలీసు శాఖలోని వివిధ విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ఫోరెన్సిక్‌, విపత్తు నిర్వహణ పరికరాలు, ఆక్టోపస్‌ విభాగం సహా ఇతర విభాగాల ఆధునిక ఆయుధాలు, పరికరాల వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిఘా వ్యవస్థలో డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు.

Author
Share This Article
Leave a review