విజయవాడ, అక్టోబర్ 8:– అంతరిక్ష ప్రయోగాల రంగంలో రానున్న రోజుల్లో భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్రాంత శాస్త్రవేత్త, ఇస్రో అంతరిక్ష విభాగం సాంకేతిక సలహాదారు, ఏఐసీటీఈ ప్రొఫెసర్ డా. బి.వి. సుబ్బారావు అన్నారు. విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలని సూచించారు.
విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం సెమినార్ హాలులో నిర్వహించిన ఫిజిక్స్ ఇండక్షన్ ప్రోగ్రాంలో డా. బి.వి. సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. భారతీయ అంతరిక్ష ప్రస్థానం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని పేర్కొన్నారు.
అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కూడా అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తి చూపుతోందని, అనేక స్టార్టప్ సంస్థలు రోదసీ రంగంలోకి వేగంగా ప్రవేశిస్తున్నాయని చెప్పారు.Vijayawada City news
చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రయోగాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక విజయాలు సాధించే దిశగా దేశం ముందుకు సాగుతోందని తెలిపారు. విద్యార్థులు భౌతిక శాస్త్రంపై పట్టు సాధించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు.
కార్యక్రమం అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్, ఫిజిక్స్ విభాగాధిపతి డా. శ్రీనివాస కృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జె. పాండురంగారావు కలిసి శాస్త్రవేత్త డా. బి.వి. సుబ్బారావును సత్కరించారు. కార్యక్రమంలో ఫిజిక్స్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



